తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకున్న బాణాసంచా గోడౌన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకున్న బాణాసంచా గోడౌన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ సిబ్బంది భావిస్తున్నారు. వివరాలు.. జిల్లాలోని పాలయపేటలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో గోడౌన్‌లో ఉంచిన క్రాకర్లు ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. దీంతో అక్కడ భారీ పేలుడుతో విధ్వంసం చోటుచేసుకుంది.
ఈ ఘటననపై సమాచారం అందుకున్న వెంటనే కృష్ణగిరి పట్టణ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఇక, బాణాసంచా గోడౌన్ నుంచి చెలరేగిన మంటలు.. హోటల్ సహా ఇతర దుకాణాలకు, సమీపంలోని ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఒక దుకాణం, మూడు ఇళ్లు కూలిపోయాయని, శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు.
చనిపోయిన ఎనిమిది మందిలో ఏడుగురిని అధికారులు గుర్తించారు. బాణసంచా షాప్ యజమాని రవి, అతని భార్య జయశ్రీ, వారి కుమార్తె రితిక, వారి కుమారుడు రితీష్, హోటల్ షాపు యజమాని రాజేశ్వరి, వారి పొరుగువారు ఇబ్రహీం, ఇమ్రాన్‌లుగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ఇక, ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇక, ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి రూ. లక్ష, స్వల్ప గాయాలు తగిలిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక, ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుంచి పరిహారం విడుదల చేస్తారు. ఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తమిళనాడు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్ శక్కరపాణిని సంఘటనా స్థలానికి పంపామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రత్యేక సంరక్షణ అందించాలని ఆదేశించామని స్టాలిన్ తెలిపారు.
