రైతులతో ముగిసిన చర్చలు.. ఎంఎస్పీపై కేంద్రం కీలక ప్రాతిపాదనలు.. అందులో ఏముందంటే ?
ఎంఎస్పీ (minimum support price - MSP)కి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని రైతు సంఘాలు పిలుపునిచ్చిన ‘ఢిల్లీ చలో’ (Delhi chalo)కు తాత్కాలిక విరామం లభించింది. రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు కొంత సానుకూలతో ముగిశాయి. కేంద్రం ప్రతిపాదనలపై తమ ఫోరమ్ లో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాలు (Farmers' unions) తెలిపాయి.
పలు డిమాండ్ల సాధన కోసం ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం పేరిట నిరసన తెలుపుతున్న రైతు సంఘాలతో జరిగిన నాలుగో విడత చర్చలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం 8.15 నిమిషాలకు ప్రారంభమైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజాము వరకు సాగాయి. ఈ చర్చలో ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) కొనుగోలు చేసేలా కేంద్రం ప్రణాళికలను రూపొందించింది.
అయోధ్య రాములోరికి తిరుమల వెంకన్న సాయం..
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లతో కూడిన కమిటీ ఈ ప్రతిపాదనను రైతులకు సమర్పించింది. ఈ సమావేశంలో రైతు నేతలు పలు ఆందోళనలను లేవనెత్తారని, చర్చలు సానుకూలంగా ఉన్నాయని గోయల్ పేర్కొన్నారు.
అయితే దీనిపై సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాకు చెందిన రైతు నాయకులు ఫిబ్రవరి 19, 20 తేదీల్లో తమ ఫోరమ్ లలో కేంద్రం ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, దాని కంటే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. చర్చల్లో పురోగతి కనిపించడంతో రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
ప్రభుత్వ సంస్థలు కీలక పంటలను ఎంఎస్పీకి కొనుగోలు చేయడానికి పంచవర్ష ప్రణాళిక ప్రభుత్వ ప్రతిపాదనలో ఉంది. నాఫెడ్ వంటి సహకార సంఘాలు రైతులతో ఐదేళ్ల ఒప్పందాలు కుదుర్చుకోవడం, పరిమాణ పరిమితులు లేకుండా ఎంఎస్పీకి కొనుగోళ్లు జరిగేలా చూడటం వంటి పరిష్కారాలను తాము ప్రతిపాదించామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పరిమితి లేకుండా ఎంఎస్పీ హామీలతో పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్నల్లో వైవిధ్యంపై దృష్టి సారించినట్లు గోయల్ వివరించారు. ఈ విధానం పంజాబ్ వ్యవసాయాన్ని కాపాడుతుందని, భూగర్భ జల మట్టాన్ని మెరుగుపరుస్తుందని, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న భూమి బీడుగా మారకుండా కాపాడుతుందని ఆయన అన్నారు.
వెల్లుల్లి కిలో రూ.500.. పంట పొలాల్లో సీసీ కెమెరాలతో రైతుల పహారా..
కాగా.. ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో 'ఢిల్లీ చలో' మార్చ్ను తాత్కాలికంగా నిలిపివేయాలని రైతు నేతలు నిర్ణయించారు. రెండు రోజుల పాటు తమ ఫోరమ్ లలో చర్చించి, నిపుణుల అభిప్రాయం తీసుకుని తరువాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని రైతు నేత శ్రావణ్ సింగ్ పంధేర్ తెలిపారు. అయితే రుణమాఫీ, ఇతర డిమాండ్లపై చర్చ పెండింగ్ లో ఉందని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఇవి పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని, ప్రస్తుతం ఢిల్లీ చలో మార్చ్ కొనసాగుతోందని, అయితే అన్ని సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.