ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
పశ్చిమ బెంగాల్ (West Bengal) అటవీ శాఖ (Forest Department) తీరుపై విశ్వ హిందూ పరిషత్ (Vishwa Hindu Parishad) ఆగ్రహం వ్యక్తం చేసింది. శిలిగుడిలోని సఫారీ పార్కు (Siligudi Safari Park)లో సీతా అనే ఆడ సింహాన్ని (female loin sita), అక్బర్ (male loin akbar) అనే మగ సింహాన్ని ఒకే ఎన్‌క్లోజర్‌లోకి వదిపెట్టిందని, ఇది హిందువులను అవమానించడమే అవుతుందని వీహెచ్ పీ (VHP) కోర్టును ఆశ్రయించింది.
ముస్లిం మతానికి చెందిన అబ్బాయి, హిందూ మతానికి చెందిన అమ్మాయి పెళ్లి చేసుకోవడం, దానిని బజరంగ్ దళ్, శ్రీరామ సేన, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) వంటి కొన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించడం వంటి ఘటనలు గత కొన్నేళ్లుగా వెలుగులోకి వస్తున్నాయి. మెజారిటీ వర్గానికి చెందిన అమ్మాయిలను మోసపూరితంగా ఇస్లాం మతంలోకి మార్చేందుకే ముస్లిం అబ్బాయిలు ‘లవ్ జిహాద్’కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నాయి. తాజాగా ఓ మగ, ఆడ సింహాన్ని ఒకే ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ విశ్వ హిందూ పరిషత్ కోర్టుకు ఎక్కింది.
అసలేం జరిగిందంటే ?
పశ్చిమబెంగాల్ లో శిలిగుడిలోని సఫారీ పార్కు ఉంది. అందులో ఇటీవల ఓ ఆడ, మగ సింహాన్ని అటవీ శాఖ అధికారులు తీసుకువచ్చారు. అందులో ఆడ సింహానికి ‘సీత’, మగ సింహానికి ‘అక్బర్’ అపి పేరు పెట్టారు. తరువాత ఆ రెండు సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. అటవీశాఖ అధికారుల తీరును సవాల్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) బెంగాల్ విభాగం జల్ పాయిగురిలోని కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ను ఆశ్రయించింది.
రాష్ట్ర అటవీ అధికారులు, బెంగాల్ సఫారీ పార్క్ డైరెక్టర్ ను ప్రతివాదులుగా చేర్చిన ఈ పిటిషన్ ను జస్టిస్ సౌగత భట్టాచార్య నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం విచారించింది. దీనిని ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. ఈ రెండు సింహాలను ఇటీవల త్రిపురలోని సెపాహిజాలా జూలాజికల్ పార్క్ నుండి ఫిబ్రవరి 13వ తేదీన తీసుకువచ్చామని, తాము వాటికి పేర్లు పెట్టలేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడికి వచ్చే ముందే వాటికి పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సింహాలకు పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు పేరు పెట్టారని, 'అక్బర్'తో 'సీత'ను ఉంచడం హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని వీహెచ్ పీ చెబుతోంది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని కోరుతోంది.