One Nation One Election : భారత్ లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా? : ఎస్ గురుమూర్తి విశ్లేషణ
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' డిమాండ్ ఎన్నాళ్లుగానో వినిపిస్తోంది. అంటే లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా కాకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటి జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై మరోసారి తీవ్ర చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై స్వామినాథన్ గురుమూర్తి రాసిన సమగ్ర కథనాన్ని ఓసారి పరిశీలిద్దాం.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలనాపగ్గాలు మనకే దక్కాయి. ఈ క్రమంలో 1952 లో మొదటిసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి... అప్పుడు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1952 నుండి 1967 వరకు ఇలాగే దేశవ్యాప్తంగా లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇలా నాలుగుసార్లు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగాయి.ఇలా ఇప్పుడు వినిపిస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఏనాడో నిర్వహించింది. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోంది.
అయితే తమిళనాడుకు చెందిన డిఎంకే పార్టీ అసెంబ్లీని నాలుగేళ్ళకే రద్దుచేసి ఎన్నికలకు సిద్దం కావడంతో గందరగోళం ఏర్పడింది. కానీ 1971 లో కూడా తమిళనాడుతో పాటు అన్నిరాష్ట్రాలు అసెంబ్లీలకు లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిపారు. అలాంటిది ఇప్పుడు బిజెపి జమిలి ఎన్నికలంటే కాంగ్రెస్ కంగారుపడిపోతోంది... రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే మోదీ సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ వాదనతో కొన్ని ప్రాంతీయపార్టీలు కూడా ఏకీభవించడంతో జమిలి ఎన్నికలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
1971 వరకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగ్గా ఆ తర్వాత ఎన్నికల విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇప్పుడు ఎన్నికల విధానం వుంది? ఇప్పుడున్న ఎన్నికల విధానాన్ని మార్చి మళ్ళీ జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ప్రయత్నిస్తున్నారు? అనేది తెలుసుకుందాం.
ఒకే దేశం - ఒకే ఎన్నిక (జమిలి) అవసరమేంటి?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక చాలాకాలం జమిలి ఎన్నికలు జరిగాయన్నది ఇప్పటి జనరేషన్ లో చాలామందికి తెలియదు... అంతెందుకు 1970 తర్వాత పుట్టిన చాలామందికి తెలియదు. 1956 లో బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయ్యాయి. ఇలా ఏడు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ రద్దుకావడం జమిలి ఎన్నికలకు మార్గాన్ని సుగమం చేసింది. 1957 లో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇలా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడంవల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి? ప్రస్తుతం లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలేంటి? అన్నది తెలుసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ వేరువేరుగా ఎన్నికల నిర్వహణ ప్రతికూలతలను వివరిస్తూ జమిలి ఎన్నికలను ప్రతిపాదిస్తున్నారు. అయితే ఇదేమీ కొత్త పద్దతి కాదు పాత ఎన్నికల విధానాన్నే పునరుద్దరించాలన్నది ఆయన ప్రయత్నమని అర్థమవుతుంది.
జమిలి ఎన్నికల పరిణామక్రమం రాజకీయ అస్థిరతను తెలియజేస్తుంది. స్వాతంత్ర్యం తర్వాత చాలాకాలం దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ లో ఆయారాం గయారాం కల్చర్ పెరగడంతో ఈ అస్థిరతకు కారణమయ్యింది. పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు పెరిగి ప్రాంతీయ పార్టీల ఏర్పాటు వేగవంతంఅయ్యింది. ఇలా ప్రాంతీయ పార్టీలు పెరగడంతో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. పార్లమెంట్ తో పాటు కాకుండా విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం మొదలయ్యింది.
1967 తర్వాత భారత రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. చివరిసారిగా దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ 1972 లో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకే వేరువేరుగా ఎన్నికలు నిర్వహించారు. ఇలా దేశ రాజకీయాలు, రాష్ట్రాలను వేరుచేసారు. ఇక 1989 తర్వాత దేశంలో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గడంతో సంకీర్ణ ప్రభుత్వాల జమానా ప్రారంభమైంది. ఈ పరిణామం రాజకీయాల్లో మరింత అనిశ్చితికి దారితీసింది. ఎంతలా అంటే పదేళ్లలో ఐదుసార్లు పార్లమెంట్ ఎన్నికల జరిగాయంటేనే అర్థం చేసుకోవచ్చు.
జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక లేకపోవడంతో అది కాలక్రమేణ కనుమరుగయ్యింది. తద్వారా ఎన్నికల వ్యవస్థలో పూర్తిగా మార్పులు వచ్చి లోక్ సభ, అసెంబ్లీలు వేరువేరు... వాటికి కలిపి ఎన్నికలు నిర్వహించలేమనే పరిస్థితి ఈనాడు ఏర్పడింది.
ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులు రాజకీయ అస్థిరతనే కాదు పాలనాపనమైన ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో వుండే పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వెసులుబాటు దక్కుతుంది... దీంతో దేశమంతా తామే అధికారంలో వుండాలని ఆ పార్టీలు చూస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అస్థిరంగా మారుతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, మధ్యంతర ఎన్నికలు తీసుకురావడం వంటి పరిణామాలను దారితీస్తోంది.
మన దేశాన్ని పట్టిపీడిస్తున్న రాజకీయ అస్థిరతను రూపుమాపాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మంచి మార్గం. జమిలి ఎన్నికలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి తనదైన ముద్ర వేయగలవు. ప్రస్తుత ఎన్నికల విధానం దేశం అభివృద్ది, ప్రజా సంక్షేమంపై ప్రభావం చూపుతోంది... కాబట్టి ప్రత్యామ్నాయం అవసరం. కాబట్టి 1967 కు ముందున్న జమిలి ఎన్నికల విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు.
జమిలి ఎన్నికలపై రామ్ నాథ్ కోవింద్ ప్రతిపాదనలివే :
భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతత్వంలో జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీ జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చేలా ప్రతిపాదనలను రూపొందించింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్‌తో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు, నిపుణులు జమిలి ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలు, ఎదురయ్యే సవాళ్ల గురించి నిశితంగా పరిశోధించారు.
ఇప్పటికే జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోవింద్ కమిటీ సేకరించింది. ఇందులో 32 పార్టీలు ఒకే ఈ జమిలి ఎన్నికలకు మద్దతు తెలపగా మరో 15 పార్టీలు వ్యతిరేకించాయి. అయితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, లెప్ట్ ఫ్రంట్, బహుజన్ సమాజ్ వాది, ఆమ్ ఆద్మీ వంటివి ఈ ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు.
191 రోజులపాలు రాజకీయ పార్టీలతో సమగ్ర చర్చలు, 21,558 మంది అభిప్రాయాలను సేకరించింది కోవింద్ కమిటీ. అంశాలన్నింటిని క్రోడీకరించి 18,626 పేజీల సమగ్ర నివేదికను రూపొందించి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. ఈ నివేదిక ప్రకారం దేశం జమిలి ఎన్నికలను కోరుకుంటోందని అర్థమవుతోంది...ఇదే అమలైతే దేశ చరిత్రలో మరో మైలురాయిగా మిగిలిపోతుంది.
జమిలి ఎన్నికల ఆవశ్యకతను రామ్ నాథ్ కోవింద్ కమిటీ తమ నివేదికలో వివరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా జరిగే ఎన్నికలు పరిపాలనపైనే కాదు ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ ఎన్నికల సంఖ్య మరింత పెరిగి గందరగోళం ఎక్కువయ్యిందని తెలిపింది. 1950-1960 మధ్యకాలంలో అంటే పదేళ్ళలో కేవలం 25 సార్లు ఎన్నికలు జరిగితే 1961-1970 మధ్య ఈ సంఖ్య 71కి పెరిగింది. ఇక 2001-2010 మధ్య 62, 2011-2020 మధ్య 63 ఎన్నికలు జరిగాయి. 2021-2023 మధ్య మాత్రమే 23 ఎన్నికలు జరిగాయి. ఈ నిరంతర ఎన్నికల ప్రక్రియ కేవలం రాజకీయాలను మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఇదే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగినే జిడిపి వృద్ధి 1.5% పెరుగుతుందని, ద్రవ్యోల్బణం 1.1% తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు జమిలి ఎన్నికల వల్ల క్రైమ్ రేట్లు తగ్గుతాయని చెబుతున్నారు.
ప్రస్తుత వ్యవస్థలో ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులు చాలా ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వాల పదవీకాలంలో దాదాపు 44 శాతం అంటే సుమారుగా 800 రోజులు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా జరుగుతున్న ఎన్నికలు, ఎన్నికల నియమావళి కారణంగా వృధా అవుతోంది. ఇలా నిరంతర ఎన్నికలు పాలనకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆర్థిక వృద్ధి మందగించడానికి కారణం అవుతున్నాయి. వీటన్నింటికి పరిష్కారం జమిలి ఎన్నికలతో కలుగుతుంది... కాబట్టి నిపుణుల కమిటీ ఈ ఎన్నికల నిర్వహణకే మద్దతిచ్చింది.
జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక సలహాలు, సూచనలను కోవింద్ కమిటీ రిపోర్టులో పొందుపర్చింది. సుధీర్ఘ చర్చలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరణ తర్వాత 18,626 పేజీల సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూనే దేశానికి ఆర్థిక శ్రేయస్సు కాపాడుతుందని పేర్కొన్నారు.
జమిలి ఎన్నికలను అమలుచేయడం ఎలా?
భారత రాజ్యాంగ సవరణ ద్వారా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యపడుతుందని నిపుణుల కమిటీ తెలిపింది. రాష్ట్రాల అనుమతి లేకుండానే కేంద్ర లోక్ సభతో పాటు అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు కల్పిస్తుంది. రాజ్యాంగ సవరణ తర్వాత దేశ రాష్ట్రపతి జమిలి ఎన్నికలపై ప్రకటన చేయనున్నారు. ఇది 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత వుండనుంది. రాష్ట్రాల అసెంబ్లీలు ఎప్పుడు ఎన్నికైనా పార్లమెంట్ పదవీకాలాన్నే పరిగణించనున్నారు. అంటే 2024 లోక్ సభ పదవీకాలం ఎప్పుడయితే ముగుస్తుందో అప్పుడే రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం కూడా ముగుస్తుంది... తద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.
పాఠకులకు గమనిక : ఈ వ్యాసం మొదట తుగ్లక్ తమిళ వీక్లీ మ్యాగజైన్‌లో వచ్చింది. ఇది www.gurumurthy.net కోసం తుగ్లక్ డిజిటల్ ద్వారా ఇంగ్లీష్ లో ట్రాన్స్ లేట్ అయ్యింది. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌లో ప్రచురించబడింది. ఇందులో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు పూర్తిగా వ్యాసకర్త వ్యక్తిగతమైనవి.