‘ఆడపిల్లలు, పేదరికాన్ని చూసి దయతో ఇల్లు అద్దెకిచ్చాను’.. అద్దె ఇంటిలో అనుమానిత ఉగ్రవాది అరెస్టు
కర్ణాటకలోని బెంగళూరులో ఆర్టీ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న అనుమానిత ఉగ్రవాది సయ్యద్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. దీంతో ఆ ఇంటి యజమానులు షాక్ అయ్యారు.

బెంగళూరు: కర్ణాటకలో ఉగ్రవాద కలకలం రేగింది. ఐటీ హబ్ బెంగళూరులోని ఆర్టీ నగర్‌లో క్రైం బ్రాంచ్ పోలీసులు ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. గురువారం వారు నివసిస్తున్న ఇండ్లలో తనిఖీలు చేసి నాలుగు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకల కలకలం రేపుతున్నది. అయితే.. ఓ అనుమానిత ఉగ్రవాదికి ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని మీడియా ముందు బోరుమన్నారు.
ఆర్టీ నగర్ సుల్లాన్ పాళ్య ఇంట్లో మకాం వేసి విధ్వంసానికి కుట్ర పన్నారు. ఈ కేసులో సెంట్రల్ క్రైం బ్రాంచ్ దర్యాపతు ముమ్మరం చేసింది. వారు ఇచ్చిన సమాచారంతో కొడిగేహళ్లిలోని ఓ ఇంట్లో దాచిన పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో నుంచి జునైదే అనే వ్యక్తి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు పంపించారని ఓ అనుమానితుడు జాహిద్ పోలీసులకు వివరించాడు.
Also Read: మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు పై ఆగ్రహం.. ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పు.. వీడియో వైరల్
ఓ అనుమానిత ఉగ్రవాది సయ్యద్ నెలన్నరి క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో తమ ఇంటికి వచ్చామని ఇంటి యజామాని చెప్పారు. తాము పేదవాళ్లను, తలదాచుకోవడానికి అద్దెగా ఇల్లు ఇవ్వాలని వారు ప్రాధేయపడ్డారని వివరించారు. రెండు నెలల తర్వాత అడ్వాన్స్ ఇస్తానని చెప్పారని తెలిపారు. ఆడపిల్లల ముఖం చూసి దయతో వారికి ఇల్లు అద్దెకు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆర్టీ నగర్‌లోని మసీదు వద్ద గల తమ ఇంట్లోకి వారు అద్దెకు దిగారని వివరించారు. అయితే బుధవారంనాడు సీసీబీ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి సయ్యద్‌ను అరెస్టు చేయడంతో యజమానులు హతాశయులయ్యారు. మీడియా ముందు ఆమె గోడు వెళ్లబోసుకుంది. వారు చెప్పిన సమయం దాటినా కానీ, అడ్వాన్స్ ఇవ్వకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాలని తాము వారికి చెప్పామని అన్నారు. కానీ, ఈ వారంలో ఇల్లు విడిచిపెడతానని చెప్పినట్టు వివరించారు. ఇంతలోనే ఈ పరిణామాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. సీసీబీ అధికారులు అరెస్టు చేశారని చెప్పారు.