దొంగతనం అనుమానంతో ఇద్దరు మైనర్లను బందించి చెప్పుల దండలు వేసి, గ్రామంలో ఊరేగించి, వారి తల్లిదండ్రులకు రూ.3,000 జరిమానా విధించారు. బహిరంగంగా వారిమీద ఉమ్మివేసి విడుదల చేశారు.
రాంచీ : జార్ఖండ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మైనర్ బాలురిని గ్రామస్థులు తీవ్రంగా కొట్టారు. రాంచీ, సాహిబ్‌గంజ్‌లోని చాందీపూర్‌లో దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు బాలురను స్థానికులు పట్టుకుని చేతులు కట్టేశారు. ఆ తరువాత శిరోముండనం చేసి, బురద నిండిన నీటిలో నిలబెట్టారు.
అంతటితో ఆగకుండా వారి మెడలో బూట్ల దండలు వేసి, గ్రామంలో ఊరేగించి, వారి తల్లిదండ్రులకు రూ.3,000 జరిమానా విధించారు. వారిమీద బహిరంగంగా ఉమ్మివేసిన తరువాత వారిని విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాహిబ్‌గంజ్‌లోని రాజ్‌మహల్ పోలీస్ స్టేషన్‌లో నలుగురు వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
చైల్డ్ లైన్ హెల్ప్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. బాలుర స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది. దీనిమీద దర్యాప్తు చేస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ ఇంట్లో రూ.4,300 చోరీ అయ్యింది. ఇందుకు మైనర్ లలో ఒకరు కారణమని అనుమానించారు. దీంతో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొందరు వ్యక్తులు అతడి ఇంటికి వెళ్లారు. బాలుడిని ఇంటి నుంచి బయటకు లాగి తాడుతో బంధించారు. తరువాత ఉదయం, మరొక యువకుడిని కూడా అలాగే తీసుకువచ్చారు. తరువాత ఇద్దరినీ కలిపి కొట్టారు.
"వారి తల్లిదండ్రులు జరిమానా సొమ్ము తేవడానికి వెళ్ళినప్పుడు, గ్రామస్థులు వారికి సగం గుండు కొట్టించి.. చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. కొంతమంది యువకులు ఈ మొత్తం ఘటనను వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ”అని పేరు తెలపడానికి ఇష్టపడని ఓ గ్రామస్థుడు తెలిపాడు.
తర్వాత, జరిమానా మొత్తం తీసుకుని.. వారిమీద బహిరంగంగా ఉమ్మి వేసిన తర్వాత విడుదల చేశారని ఆయన తెలిపారు. మైనర్‌లో ఒకరిని 14 గంటలు, మరొకరిని 6 గంటల పాటు బంధించారని గ్రామస్తులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
“ఇద్దరు మైనర్లను కొట్టినట్లు మా దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే ఓ పోలీసు బృందాన్ని గ్రామానికి పంపించాం. మైనర్ తండ్రి వాంగ్మూలం ఆధారంగా నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులను అరెస్టు చేసేందుకు వారి గురించి వెతుకుతున్నాం’’ అని సాహిబ్‌గంజ్ ఎస్పీ అనురంజన్ కిస్పొట్టా తెలిపారు.
ఇద్దరు మైనర్లకు దొంగతనాలు చేసే అలవాటు ఉందని, గ్రామస్తులు ముందుగానే హెచ్చరించారని తెలిపారు. బాధితురాలి తండ్రి ఒకరు బీహార్‌కు చెందిన వాడని, గత 3 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నారని చెప్పారు. ఈ సంఘటన తర్వాత మైనర్ల కుటుంబాలు సిగ్గుతో అక్కడి నుండి వెళ్లిపోయాయి. అయితే చైల్డ్-లైన్ బృందం వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి వారిని వెతికి పట్టుకున్నాయి.
