పంద్రాగస్టున ఉగ్ర బీభత్సానికి ప్లాన్ చేసిన అనుమానిత ఉగ్రవాదిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. బుధవారం ఏటీఎస్ ఆ అనుమానిత టెర్రరిస్టును ఆజాంగడ్‌లో అరెస్టు చేసింది.  

లక్నో: ప్రతి యేటా పంద్రాగస్టున లేదా గణతంత్ర దినోత్సవాన అదును చూసి పంజా విసరాలని ఉగ్రవాదులు ప్రయత్నించడాలు చూస్తూనే ఉన్నాం. కానీ, ప్రతిసారి వారి కుయుక్తులు, కుట్రలను భారత రక్షణ వ్యవస్థ కనిపెడుతూనే ఉన్నది. వారి కుట్రలకు బ్రేకులు వేస్తూనే ఉన్నది. తాజాగా, ఈ సారి కూడా పంద్రాగస్టును ఉగ్రబీభత్సానికి ప్లాన్ వేస్తున్న ఓ ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న నిందితుడు సబాఉద్దీన్ అజ్మీని యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ యూపీలోని ఆజంగఢ్‌లో అరెస్టు చేశారు. నిందితుడిని బుధవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ నెల 22వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.

నిందితుడు సబాఉద్దీన్ అజ్మీ పంద్రాగస్టున అటాక్ చేయడానికి ప్లాన్ వేస్తున్నట్టు అధికారులు ఆరోపించారు.

సబాఉద్దీన్ అజ్మీ ఐఎస్ఐఎస్ రిక్రూటర్‌తో నేరుగా కాంటాక్ట్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఏఐఎంఐఎం సభ్యుడని ఇండియా టుడే కథనం తెలిపింది. 

నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అంతేకాదు, ఆ అనుమానిత ఉగ్రవాది దగ్గర ఐఈడీ తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఉన్నట్టు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు, కార్ట్‌రిడ్జ్‌లనూ వారు రికవరీ చేసుకున్నారు.

సబాఉద్దీన్ మొబైల్ ఫోన్‌నూ ఏటీఎస్ అధికారులు సెర్చ్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ టెలిగ్రామ్‌లో క్రియేట్ చేసిన అల్ సకర్ మీడియా‌లో నిందితుడు ఉన్నట్టు ఆధారాలు లభించినట్టు ఆ కథనం పేర్కొంది.