ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్టు చేసేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అయితే అతడి మామ, కారు డ్రైవర్ ఆదివారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం నుంచి పంజాబ్ పోలీసులు ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఖలిస్థాన్ అనుకూల నేత అమృత్ పాల్ సింగ్ మామ, డ్రైవర్ జలంధర్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని జలంధర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) స్వరణ్ దీప్ సింగ్ సోమవారం ధృవీకరించారు. అమృత్ పాల్ మేనమామ హర్జీత్ సింగ్, డ్రైవర్ హర్ ప్రీత్ సింగ్ ఆదివారం రాత్రి మెహత్ పూర్ ప్రాంతంలోని గురుద్వారా సమీపంలో లొంగిపోయారని ఆయన చెప్పారు. అయితే ఖలిస్తాన్ సానుభూతిపరుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని తెలిపారు.
ఢిల్లీలో షాకింగ్.. యువతిని తిడుతూ, బలవంతంగా క్యాబ్ లోకి లాక్కెళ్లి.. వీడియో వైరల్....
అమృత్ పాల్, అతడి బృందం ‘వారిస్ పంజాబ్ దే’పై పంజాబ్ ప్రభుత్వం శనివారం పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఆ రోజు పోలీసులు ఆ సంస్థకు చెందిన 78 మంది సభ్యులను అరెస్టు చేశారు. అయితే జలంధర్ జిల్లాలో అతడి వాహనాన్ని అడ్డుకోవడంతో అమృత్ పాల్ సింగ్ ఎలాగోలా పోలీసుల ఉచ్చు నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతడి కోసం పోలీసులు ఆదివారం పంజాబ్ అంతటా ఫ్లాగ్ మార్చ్ లు, తనిఖీలు నిర్వహించారు. మరో 34 మంది మద్దతుదారులను అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్న నలుగురిని సుదూర అస్సాంలోని జైలుకు తరలించారని ‘జీ న్యూస్’ నివేదించింది.
కాగా.. ఖలిస్తాన్ అనుకూల నాయకుడు అమృత్ పాల్, అతడి మద్దతుదారులపై విద్వేషాలు రెచ్చగొట్టడం, హత్యాయత్నం, పోలీసులపై దాడి చేయడం, ప్రభుత్వోద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. అజ్నాలాలో పోలీసు సూపరింటెండెంట్ తో పాటు ఆరుగురు పోలీసులు గాయపడ్డారు.
మరో వైపు పంజాబ్ లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవల నిలిపివేతను భగవంత్ మాన్ ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం వరకు పొడిగించింది. హింసను ప్రేరేపించడం, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, బ్యాంకింగ్ సేవలకు మినహాయింపు ఉంటుందని అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
