దేశంలో కరోనా కేసులు (Corona Cases in india) పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ (Rajesh Bhushan) పలు సూచనలు చేశారు. 

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం రోజు భారత్‌లో 13,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యికి చేరులో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మరింతగా అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ (Rajesh Bhushan) పలు సూచనలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆయనకు ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్‌ రాష్ట్రాలకు లేఖలు రాశావరు.

కోవిడ్ పరీక్షలను (COVID-19 testing) పెంచాలని ఆయన ఈ లేఖలో కోరారు. ఆస్పత్రులలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతగా వేగవంతం చేయాలని చెప్పారు. ఇక, కోవిడ్ మరణాలు పెరగకుండా ఉండేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించినట్టుగా సంబంధిత వర్గాను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ఢిల్లీలోని Graded Response Action Plan మోడల్‌ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ఆలోచనను కూడా పరిశీలిస్తున్నట్టుగా ఉన్నత వర్గాలు తెలిపాయి. 

ఇక, కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ప్రకటించి.. పెద్ద ఎత్తున ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహారాష్ట్రాలో నేటి నుంచి జ‌న‌వరి 7 వ‌ర‌కు 144 సెక్ష‌న్ విధించారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలపై పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Also read: ఒమిక్రాన్ టెన్షన్.. ముంబైలో నేటి నుంచి జ‌న‌వరి 7 వ‌ర‌కు 144 సెక్ష‌న్..

భారత్‌లో ఇప్పటివరకు 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. ఒమిక్రాన్ బారిన పడ్డ వారిలో 320 మంది కోలుకున్నారని వెల్లడించింది. ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. ఢిల్లీలో అత్యధికంగా 263 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 252, గుజరాత్‌లో 97, రాజస్తాన్‌లో 69, కేరళలో 65 కేసులు నమోదయ్యాయి. 

దేశంలో గడిచిన 24 గంటల్లో 13,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది క్రితం రోజు నమోదైన 9,195 కేసులతో పోలిస్తే.. 43 శాతం ఎక్కువ. ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,48,22,040కి పెరిగింది. తాజాగా కరోనాతో 268 మృతిచెందగా.. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,80,860కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,486 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,42,58,778‬కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 82,402 గా ఉంది.