Asianet News TeluguAsianet News Telugu

టూ ఫింగర్ టెస్ట్ పై సుప్రీం నిషేధం.. వెంటనే వైద్య పాఠ్యాంశాలనుంచి తొలగించాలని ఆదేశం...

అత్యాచార బాధితులపై నిర్వహించే టూ ఫింగర్ టెస్ట్ విధానం ఇంకా కొనసాగుతుండడంపై సుప్రీంకోర్టు మండిపడింది. బాధితురాలైన మహిళను మళ్లీ బాధితురాలిని చేయడమేనంటూ ఈ విధానం మీద నిషేధం విధించింది. 

SupremeCourt slammed two-finger test on rape and sexual assault victims
Author
First Published Nov 1, 2022, 10:35 AM IST

ఢిల్లీ : అత్యాచార బాధితులను నిర్ధారించడానికి కొనసాగిస్తున్న టూ ఫింగర్ టెస్ట్ విధానంపై సుప్రీం కోర్టు సోమవారం నిషేధం విధించింది. ఈ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంకా ఈ విధానం సమాజంలో కొనసాగడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఓ అత్యాచారం కేసులో నిందితుడికి జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ.. జస్టిస్ డి.వై. చంద్రచూడ్,  జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం రెండువేళ్ల పరీక్షపై తీవ్రస్థాయిలో మండిపడింది. గతంలో ఎన్నో సార్లు ఈ విధానాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసింది.

మహిళల మర్మావయవాలలో రెండువేళ్లతో పరీక్షించడం వారి పరువుకు భంగం కలిగించడమే అని, అత్యాచార బాధితులను మరోసారి అవమానించడమేనని పేర్కొంది. ఈ పరీక్షలు నిర్వహించకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖను, రాష్టాల ఆరోగ్య కార్యదర్శులను ఆదేశించింది. లైంగిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే మహిళలపై అత్యాచారం జరగదని చెప్పడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఇలాంటి ఆలోచనలు.. మనలోని పితృస్వామ్య మనస్తత్వానికి నిదర్శనం అని తెలిపింది. 

ఆ చట్టం ప్రకారం .. పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం ..

‘రెండువేళ్ల పరీక్ష విధానానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఇది మహిళను మళ్లీ బాధితురాలిని చేస్తుంది. లైంగిక పరంగా చురుగ్గా ఉన్న మహిళ అత్యాచారానికి గురి కాదు అన్న తప్పుడు ఊహే ఈ పరీక్షకు మూలాధారం. మహిళ సాక్ష్యాన్ని ఆమె లైంగిక చరిత్ర ఆధారంగా  పరిశీలించడం సరికాదు’  అని ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి టూ ఫింగర్ టెస్ట్ కు సంబంధించిన పాఠాలను తక్షణమే తొలగించాలని కేంద్రాన్ని, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శులను ఆదేశించింది.

టూ ఫింగర్ టెస్ట్ అంటే ఏమిటి?
బాధితురాలిపై లైంగిక అత్యాచారం జరిగిందా లేదా.. చెక్ చేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో హైమెన్ పొరను చెక్ చేస్తారు. స్త్రీలు లైంగిక సంబంధంలో పాల్గొన్నప్పుడు మాత్రమే హైమన్ పొర నలిగిపోయే అవకాశం ఉన్నందున దానిని తనిఖీ చేస్తారు. ఎక్కువగా అత్యాచారం బాధితులపై.. నిజనిర్థారణ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష ఎలా నిర్వహిస్తారు?
డాక్టర్లు మాత్రమే ఈ టూ ఫింగర్ టెస్ట్ చేస్తారు. అత్యాచార బాధితురాలి యోనిలోకి డాక్టర్ రెండు వేళ్లను చొప్పించి, అక్కడి కండరాల బలహీనతను చెక్ చేసి.. దాన్ని బట్టి ఆమె లైంగికంగా చురుకుగా ఉందో లేదో తెలుసుకుంటారు.

రెండు వేళ్ల పరీక్షపై వర్మ కమిటీ ఏం చెప్పిందంటే...?
2012లో దేశ రాజధానిలో నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసు జరిగిన వెంటనే మాజీ ప్రధాన న్యాయమూర్తి జెఎస్ వర్మ నేతృత్వంలోని కమిటీ, అటువంటి కేసుల కోసం కఠినమైన చట్టాలను, టూ ఫింగర్ టెస్ట్ లను నిషేధించాలని సిఫారసు చేసింది.

"లైంగిక వేధింపుల విషయంలో యోని పరిమాణానికి ఎటువంటి సంబంధం లేదని నొక్కి చెప్పడం చాలా ముఖ్యం, అందువల్ల సాధారణంగా రెండు వేళ్ల పరీక్షగా సూచించబడే యోని కండరాల సడలింపును నిర్ధారించడానికి పరీక్ష చేయకూడదు.ఈ పరీక్ష ఆధారంగా ఆమె సెక్సువల్ గా యాక్టివ్ గా ఉంది లాంటి పరిశీలనలు లేదా  తీర్మానాలు చేయకూడదు. ఇది చట్టపరంగా నిషేధించబడింది. సిఫార్సు ప్రకారం.. ది క్రిమినల్ లాస్ (సవరణ) చట్టం, 2013, రెండు వేళ్ల పరీక్షను చట్టవిరుద్ధం చేసింది.

రెండు వేళ్ల పరీక్షకు శాస్త్రీయత ఎంత..? 
దీనికి సరైన సమాధానం లేదు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, యోనిలోని హైమన్ పొరను బట్టి కన్యాత్వాన్ని లేదా.. అత్యాచారాన్ని నిర్ధారించడం కష్టమే. యోనిలో సన్నని పొర అయిన హైమెన్, లైంగిక కార్యకలాపాల సమయంలోనే కాకుండా రోజువారీ పనిలో లేదా ఆటలలో, ఏదైనా శారీరక శ్రమ సమయంలో కూడా చీలిపోతుంది. అంతేకాకుండా, పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో చాలాసార్లు హైమెన్ చాలా లోతుగా ఉండటం వలన అత్యాచారం జరిగినా చెక్కుచెదరకుండా ఉంటుంది. కాబట్టి, వైద్యుల ప్రకారం, ఈ పరీక్షకు శాస్త్రీయత లేదు.

సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది?
మే 2013లో, అత్యాచార బాధితుల గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందన్న కారణంతో సుప్రీంకోర్టు టూ ఫింగర్ టెస్ట్ ను నిషేధించింది. లైంగిక వేధింపులను నిర్ధారించడానికి మెరుగైన వైద్య విధానాలను అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. 2018లో, ఐక్యరాజ్యసమితి మానవ హక్కులు, యూఎన్ మహిళలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మహిళలపై హింసను తొలగించడానికి రెండు వేళ్ల పరీక్షను నిషేధించాలని పిలుపునిచ్చాయి. ఇది వైద్యపరంగా అనవసరమైనది, తరచుగా బాధాకరమైనది, అవమానకరమైనదని ఒక బాధాకరమైన అభ్యాసం ముగియాలని కోరింది.

వర్మ కమిటీ సిఫారసుల తర్వాత ప్రభుత్వం అన్ని వైద్య సంస్థలకు రేప్ టెస్ట్ కిట్‌లను అందజేస్తున్నప్పటికీ, ఇంకా రెండు వేళ్ల పరీక్ష మనదేశంలో, ఇతర దేశాలలో నిర్వహించబడుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios