ఉత్తరప్రదేశ్‌లో అక్రమ ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. రాష్ట్రంలో గత వారం జరిగిన ఘర్షణల్లో ప్రమేయం ఉన్నవారి అక్రమ నివాసాలను కూల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే పలువురి నివాసాలను కూల్చేశారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూల్చివేతలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. రాష్ట్రంలో మరిన్ని కూల్చివేతలు చేపట్టే అవకాశాలు ఉంటే అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ పాటించేలా ఆదేశించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. చట్ట వ్యతిరేకంగా కూల్చివేతలు చేపట్టే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ పిటిషన్ కోరింది.
జామియత్ ఉలామా ఇ హింద్ అనే ముస్లిం సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. గత వారం ఘర్షణల్లో పాల్గొన్న నిందితుల అక్రమంగా నిర్మించిన నివాసాలను కూల్చేయాని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఆదేశాలకు సంబంధించి ఈ పిటిషన్ వేసింది.
ఘర్షణల వెనుక మాస్టర్ మైండ్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేత జావేద్ మహమ్మద్ ఉన్నాడని, ఆయనకు చెందిన రెండు అంతస్తుల బంగ్లాను ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆదివారం కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్డింగ్ అక్రమంగా నిర్మించారని, ఇందుకు సంబంధించి నోటీసులు పంపినా మే నెలలో జావేద్ మహమ్మద్ విచారణకు హాజరుకాలేదని అధికారులు పేర్కొన్నారు. కానీ, జావేద్ మహమ్మద్ న్యాయవాది మాత్రం ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తమకు నోటీసులు అంతకు ఒకట్రెండు రోజుల ముందే అందిందని అన్నారు. అంతేకాదు, అసలు ఆ ఇల్లు జావేద్ మహమ్మద్ పేరిట లేదని, ఆయన భార్య పేరు మీద ఉన్నదని వివరించారు.
ఈ నెల 3న నిజామ్ ఖురేషికి సన్నిహితుడైన వ్యక్తి ఇంటినీ కాన్పూర్‌లో కూల్చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం ఇలా చట్టానికి అతీతంగా చర్యలు తీసుకోవడం కచ్చితంగా సహజ న్యాయాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని పిటిషన్ పేర్కొంది. ముఖ్యంగా కోర్టులో అందుకు సంబంధించిన విషయంపై విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం కచ్చితంగా ఉల్లంఘనే అవుతుందని తెలిపింది.
