Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ చౌర్యం మర్డర్‌తో సమానమేమీ కాదు.. దోషికి శిక్ష తగ్గించిన సుప్రీంకోర్టు

విద్యుత్ చౌర్యాన్ని మర్డర్‌తో పోల్చరాదని, ఈ కేసులో దోషికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అతని శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఇప్పటికే మూడేళ్లుగా జైలులో ఉండటంతో ఆ దోషి విడుదలకు లైన్ క్లియర్ అయింది.
 

supreme court slashes jail sentence to convict in current theft case
Author
First Published Dec 16, 2022, 5:32 PM IST

న్యూఢిల్లీ: విద్యుత్ చోరీ చేయడాన్ని హత్యా నేరంతో పోలుస్తారా? కరెంట్ చోరీ కేసులో 18 ఏళ్ల జైలు శిక్ష వేయడం అంటే పౌరుడి స్వేచ్ఛను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు చేస్తూ విద్యుత్ చౌర్యం కేసులో దోషికి జైలు శిక్ష తగ్గించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ దోషి ఇప్పటికే మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. అతని శిక్షను సుప్రీంకోర్టు రెండు సంవత్సరాలకే కుదించడంతో అతను జైలు నుంచి విడుదల కానున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇక్రమ్ అనే వ్యక్తిపై విద్యుత్ చౌర్యం కింద తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన ట్రయల్ కోర్టు 2020లో ఇక్రమ్‌ను దోషిగా తేల్చింది. ఒక్క కేసుకు రెండేళ్ల చొప్పున తొమ్మిది కేసుల్లో ఆయనకు శిక్ష వేసింది. అవీ వరుసగా శిక్ష అమలు అవుతుందిన చెప్పింది. అంటే.. వరుసగా 18 సంవత్సరాలు జైలు శిక్షను విధించింది. 

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇక్రమ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ శిక్షలను ఏక కాలంలో అమలు చేయాలని, తద్వార రెండేళ్ల తర్వాత తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరారు. కానీ, హైకోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది. 2019 లోనే అరెస్టు చేయడంతో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు.

Also Read: కరెంట్ బిల్లు రూ. 3,419 కోట్లు.. షాక్‌తో హాస్పిటల్‌‌ పాలైన ఇంటి యజమాని.. ఎక్కడంటే?

ఈ కేసు పై సుప్రీంకోర్టు స్పందించింది. ఇది న్యాయాన్ని తప్పుగా అమలు చేసినట్టు అవుతుందని అభిప్రాయపడింది. ఇలాంటి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో తాము జోక్యం చేసుకుని ఉపశమనం అందించకుంటే.. తాము ఇక్కడ ఉండి ఏం చేస్తున్నట్టు అంటూ సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.

ఆయన శిక్షలను ఏకకాలంలో అమలు చేయడాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. ఇందుకు సీజే స్పందిస్తూ.. విద్యుత్ చౌర్యాన్ని మర్డర్‌తో పోల్చరాదు.. దానితో సమానంగా చూడరాదని తెలిపారు. ఇలాంటి పిటిషనర్ల ఆవేదనను వినడానికే సుప్రీం కోర్టు ఉన్నదని వివరించారు. తమకు సమస్యల్లో పెద్దా చిన్నా అనే హెచ్చుతగ్గులు ఉండవని తెలిపారు. ఇలాంటివి ప్రతి రోజూ వస్తూనే ఉంటాయని అన్నారు. విద్యుత్ చోరీ చేశాడని ఒకరిని 18 ఏళ్లు జైలుకు పంపుతామా? అని అడిగారు. 

సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌తో ఇక్రమ్ జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది.

విద్యుత్ చౌర్యం చేసినందుకు ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 136 కింద దోషికి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios