Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ బిల్లు రూ. 3,419 కోట్లు.. షాక్‌తో హాస్పిటల్‌‌ పాలైన ఇంటి యజమాని.. ఎక్కడంటే?

మధ్యప్రదేశ్‌లో ఓ ఇంటికి కరెంట్ బిల్లు వేల కోట్లల్లో వచ్చింది. జులై నెల కరెంట్ బిల్లు రూ. 3,419 కోట్లు రావడంతో ఇంటి యజమాని షాక్ తిన్నారు. మంచంపట్టేశారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది హ్యూమన్ ఎర్రర్ అని, పొరపాటును సరి చేశామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
 

MP man gets rs 3419 electricity bill, with shock house owner hospitalised
Author
Bhopal, First Published Jul 26, 2022, 11:49 PM IST

భోపాల్: ఇటీవలి కాలంలో కరెంట్ బిల్లుల షాక్‌లు ఎక్కువగా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్లా అసాధారణ రీతిలో బారీ బిల్లులు రావడం.. ఆ బిల్లులు చూసి సదరు ఇంటివారు ఖంగుతినడం వంటి వార్తలు చూశాం. అయితే, మధ్యప్రదేశ్‌లో మరీ దారుణంగా ఒక్క నెల కరెంట్ బిల్లు ఏకంగా వేల కోట్లల్లో రావడం చూసి ఆ ఇంటి యజమాని మంచం పట్టు పట్టాడు.

గ్వాలియర్ జిల్లా శివ్ విహార్ కాలనీ నివాసి సంజీవ్ కంకనే.. ప్రియాంక గుప్తాలు భార్య భర్తలు. వారిది ఉమ్మడి కుటుంబం. అందరి లాగే వారికి కూడా జులై నెలలో వినియోగించిన విద్యుత్‌కు బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టక తప్పదు మరీ. వారికి రూ. 3,419 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ బిల్లును సంజీవ్ కంకనే తండ్రి చూశాడు. కరెంట్ బిల్లు రశీదుపై ఆ బిల్లు అంకెలను చూసి ఆయన మూర్చపోయినంత పని చేశాడు. బిల్లు చూసిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చేసింది. వెంటనే ఆయనను సమీప హాస్పిటల్‌కు తరలించారు.

మధ్యప్రదేశ్ మధ్య క్షేత్ర విద్యుత్ వితరణ్ కంపెనీ (ఎంపీఎంకేవీవీసీ) ఈ నెల 20వ తేదీన బిల్లులు జెనరేట్ చేసింది. ఈ విషయం ఎంపీఎంకేవీవీసీ ఉన్నత అధికారులకు తెలిసింది. వెంటనే వారు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఎంపీఎంకేవీవీసీ పోర్టల్‌లో సరైన బిల్లు అప్‌డేట్ చేశారు. ఎంపీఎంకేవీవీసీ జనరల్ మేనేజర్ నితిన్ మాంగ్లిక్ ఇది హ్యుమన్ ఎర్రర్‌గా పేర్కొన్నారు. బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఓ ఉద్యోగి సాఫ్ట్‌వేర్‌లో వినియోగించిన యూనిట్లు ఎంటర్ చేయాల్సిన ప్లేస్‌లో కన్జ్యూమర్ నెంబర్‌ను ఎంటర్ చేశారని, అందుకే అంత పెద్ద మొత్తంలో బిల్లు జెనరేట్ అయిందని వివరించారు. సరైన బిల్లు కేవలం రూ. 1,300 అని తెలిపారు. ఈ బిల్లును సదరు వినియోగదారుడికి ఇష్యూ చేశామని చెప్పారు.

తమకు వచ్చిన బిల్లును ఎంపీఎంకేవీవీసీ పోర్టల్‌లో సరి చూశామని, సరైన బిల్లు అక్కడ అప్‌డేట్ అయినట్టు తమకు కనిపించిందని వినియోగదారుడు సంజీవ్ కంకనే తెలిపారు.

ఈ పొరపాటును సరిదిద్దినట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ తెలిపారు. బాధ్యులైన ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios