గాలి జనార్థన్ రెడ్డి అక్రమ మైనింగ్ కారణంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటకలకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. అక్రమ మైనింగ్‌తో పాటు రాష్ట్రాల సరిహద్దులు మార్చివేసినందుకు గానూ.. గాలి జైలు శిక్షను అనుభవించారు.. ఇదే సమయంలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ సహా ఆరు కంపెనీల మైనింగ్ లైసెన్సులను సుప్రీం రద్దు చేసింది. అదే సమయంలో సర్వే ఆఫ్ ఇండియా సాయంతో రెండు రాష్ట్రాల మధ్య హద్దులను స్పష్టంగా విభజించుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

అయితే ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. ఏపీ, కర్ణాటక ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం పట్ల దాఖలైన పిటిషన్లపై జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఒక పక్క మన దేశ సరిహద్దులు కాపాడుకునేందుకు రాత్రింభవళ్లు కష్టపడుతుంటే.. దేశంలోని రాష్ట్రాల సరిహద్దులు భద్రంగా లేవు.. ఏ రాష్ట్రం కూడా దీని పట్ల శ్రద్ధ చూపడం లేదని మండిపడింది.

ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లోని బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో మైనింగ్ జరపకుండా ఉండేందుకు ఇరు ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదని మొట్టికాయలు వేసింది. ఇంతకాలమైనా ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చార్యాన్ని కలిగిస్తోందని... కర్ణాటక అయితే కనీసం లాయర్‌ను కూడా పంపలేదని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. రెండు నెలల్లోగా ఇరు రాష్ట్రాల మధ్య తాత్కాలిక కంచె నిర్మాణాన్ని చేపట్టాలని సర్వే ఆఫ్ ఇండియాకు సూచించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.