కరోనాతో పోరాటంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మందితో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వ్యాక్సిన్ డోసులు, ఆక్సిజన్, ఔషధాల పంపిణీలకు సంబంధించిన అంశాలను ఈ టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షిస్తుందని అంతేకాదు కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి పూర్తి సహకారం అందేలా చర్యలు కూడా చేపట్టనుంది టాస్క్‌ఫోర్స్. 

అంతకుముందు కోవిడ్ బాధితులకు కేంద్రం కాస్త ఉపశమనం కల్పించింది. వైరస్ బారినపడిన వారు ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్‌ రిపోర్ట్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా , ఏ కారణంగానైనా రోగులకు వైద్య సేవలు నిరాకరించరాదని వెల్లడించింది.

ఈ మేరకు కొవిడ్‌ బాధితుల సౌకర్యార్థం నేషనల్ పాలసీ ఫర్‌ అడ్మిషన్‌ ఆఫ్‌ కొవిడ్‌ పేషెంట్స్‌ విధానంలో భారత ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ మార్పులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆసుపత్రులు, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.   

Also Read:కరోనా సెకండ్ వేవ్ : దేశంలో 24 గంటల్లో 4.01 లక్షల కొత్త కేసులు.. ఢిల్లీలో 4,187 మరణాలు..

కాగా, దేశంలో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజే 4,000 మందికి పైగా కోవిడ్ మరణాలు సంభవించాయి. అంతేకాదు వారంలో నాల్గవసారి 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నివారణకుకఠిన చర్యలు తీసుకుంటే  కోవిడ్ థార్డ్ వేవ్ నుండి తప్పించుకోవచ్చని నిన్న ప్రభుత్వం తెలిపింది.

ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ పెరుగుదలను నివేదించిన ఒక రోజు తర్వాత, దేశంలో ఈ రోజు మళ్లీ 4.01 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 37,23,446 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,187 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2.38 లక్షలకు చేరుకున్నాయి.

గత కొన్ని రోజులుగా చాలా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, వైరస్ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి లాక్డౌన్లు, కర్ఫ్యూలు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో తమిళనాడు, కర్ణాటక, మణిపూర్‌లు చేరాయి. కర్ణాటకలో సోమవారం నుండి మే 24 వరకు రెండు వారాల లాక్డౌన్ ప్రకటించబడింది. తమిళనాడు కూడా రెండు వారాల కర్ఫ్యూ ప్రకటించింది. మణిపూర్‌లో మే 17 వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు.