సినిమా థియేటర్స్ యాజమాన్యానికి సుప్రీంకోర్ట్ ఊరట కలిగించింది. బయటి నుంచి తీసుకెళ్లే తినుబండారాలకు అనుమతి వుండదని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
సినిమా థియేటర్స్‌లోకి బయటి నుంచి తీసుకెళ్లే తినుబండారాల అనుమతిపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు వెలువరించింది. బయటి నుంచి ఆహార పదార్ధాలు, పానీయాలు తీసుకురాకుండా అడ్డుకునే హక్కు సినిమా హాల్స్, మల్టీప్లెక్స్ యజమానులకు వుందని తెలిపింది. థియేటర్లలో అవి వున్నప్పటికీ.. వాటిని వినియోగించుకోవాలా .. వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. హాల్స్ వద్ద స్నాక్స్ , కూల్‌డ్రింక్స్‌ను ప్రేక్షకులు కొనుగోలు చేయాలన్న నిబంధన ఏం లేదని పేర్కొంది. ప్రేక్షకులు అవసరమైతేనే తినుబండారాలు కొనుగోలు చేయొచ్చని సుప్రీం తెలిపింది. థియేటర్స్‌లోకి బయటి ఆహార పదార్ధాలు అనుమతించాలన్న జమ్మూకాశ్మీర్ హైకోర్ట్ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది. అయితే థియేటర్స్‌లో ఉచితంగా తాగునీటిని అందించడాన్ని మాత్రం నిర్వాహకులు కొనసాగించాలని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
కాగా.. థియేటర్లకు వచ్చే వారు తమ వెంట తాగునీరు, తినుబండారాలను తెచ్చుకోవచ్చని 2018లో జమ్మూకాశ్మీర్ హైకోర్ట్ తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశాయి.
