మోదీ డిగ్రీ వివాదం : కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్ట్ షాక్!

ప్రధాని మోదీ డిగ్రీ వివాదంలో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Supreme Court Rejects Kejriwals Appeal in PM Modi Degree Defamation Case AKP

న్యూ ఢిల్లీ. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు సోమవారం గట్టి షాక్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేయగా ... దీనిపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా కేజ్రివాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయనపై పరువు నష్టం కేసు విచారణకు మార్గం సుగమమైంది.

పరువు నష్టం కేసులో భాగంగా గుజరాత్ పోలీసులు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడకూడా ఆయనకు నిరాశే ఎదురయ్యింది.

సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. వాదోపవాదాల అనంతరం ఈ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో ఇలాగే సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 2024లో కొట్టివేసినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. అందువల్ల, కేజ్రీవాల్ కేసును కూడా విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది.

మోదీ డిగ్రీని యూనివర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు?

సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మోదీ డిగ్రీని యూనివర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు?  ఆ డిగ్రీ నకిలీదా? అని ఆయన ప్రశ్నించారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉంటే, గుజరాత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కాదు నరేంద్ర మోదీయే పరువు నష్టం దావా వేయాల్సిందని సింఘ్వీ వాదించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను యూనివర్సిటీకి అవమానకరంగా పరిగణించలేమని ఆయన అన్నారు. యూనివర్సిటీ తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, సంజయ్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. యూనివర్సిటీ లాయర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పరువు నష్టం విచారణను కొనసాగించాలని నిర్ణయించింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios