Krishna Janmabhoomi case: శ్రీ కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా సర్వే పిటిషన్ ను నిరాకరించిన సుప్రీంకోర్టు
Krishna Janmabhoomi case: మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయానికి సంబంధింిచన అన్ని కేసులను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు తెలిపింది.

Krishna Janmabhoomi case: ఉత్తర ప్రదేశ్ మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా 'శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్' దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అన్ని కేసులు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయబడ్డాయని, వివిధ అంశాలను హైకోర్టు పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ అంశాన్ని కూడా హైకోర్టు పరిశీలిస్తుంది. ఈ మేరకు శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు
అలహాబాద్ హైకోర్టు జూలై 10న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది మధుర కోర్టు ఆదేశాలను సమర్థించింది. షాహి ఈద్గా మసీదుపై మొదట సర్వే నిర్వహించాలన్న శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ డిమాండ్‌ను మధురలోని సివిల్ కోర్టు అంగీకరించలేదు. ఆలయ పక్షం కేసును ప్రశ్నిస్తూ.. మసీదు పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను మొదట విచారిస్తామని కోర్టు తెలిపింది. . రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం.. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయడం ద్వారా సంస్థ ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
మసీదును తొలగించాలని డిమాండ్
మధురలోని షాహీ ఈద్గా మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ మథురలోని సివిల్ కోర్టులో అసలు దావా వేసింది. ఈ మసీదు శ్రీకృష్ణ జన్మస్థలంలో నిర్మించబడిందని చెబుతారు. ఇది కాకుండా.. మథురలోని శ్రీ కృష్ణ జన్మస్థాన్ షాహీ ఈద్గా మసీదుకు సంబంధించిన మరో తొమ్మిది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
విచారణ నిమిత్తం హైకోర్టుకు బదిలీ
మే 26న హైకోర్టులోని మరో బెంచ్ శ్రీ కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదుకు సంబంధించిన అన్ని ఒరిజినల్ వ్యాజ్యాలను కలిసి విచారణ కోసం హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే, శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన కేసులో కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ హైకోర్టులోని మరో బెంచ్ ఆదేశాలను సవాలు చేసింది. శుక్రవారం శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్‌షు ధులియా ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ఈ వ్యాజ్యాన్ని పరిశీలించేందుకు అయిష్టత వ్యక్తం చేసిన కోర్టు.. ఈ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులకు మాత్రమే వ్యతిరేకమని పేర్కొంది. సర్వే పిటిషన్‌ను (సిపిసిలోని ఆర్డర్ 26 రూల్ 9 ప్రకారం స్థానిక కమీషనర్ సర్వే చేయాలన్న డిమాండ్) ముందుగా విచారించాలా? లేక సిపిసిలోని ఆర్డర్ 7 రూల్ 11 కింద (మసీదు వైపు నుండి) పిటిషన్‌ను మొదట విచారించాలా? అనేది మాత్రమే ఇక్కడ సమస్య.
పిటిషనర్ సంస్థ తరఫు న్యాయవాది ఏం చెప్పారు?
శ్రీ కృష్ణ జన్మభూమి(పిటిషనర్) తరఫు సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఈ అంశాన్ని దిగువ కోర్టుకే వదిలేయడం వాస్తవానికి హైకోర్టులోని మరో బెంచ్ ఆదేశాలకు విరుద్ధమని అన్నారు. శ్రీకృష్ణ జన్మస్థలానికి సంబంధించి మధుర కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను మే 26న హైకోర్టులోని మరో బెంచ్ హైకోర్టుకు బదిలీ చేసిందని భాటియా తెలిపారు. తన కేసు హైకోర్టుకు బదిలీ అయినప్పుడు, దానిపై ట్రయల్ కోర్టు ఎలా ఉత్తర్వులు ఇస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో కోర్టు పరిస్థితిని స్పష్టం చేయాలని అన్నారు.
మసీదు తరఫు న్యాయవాది ఏం చెప్పారు?
కాగా..మసీదు తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. అన్ని కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ మే 26న జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసినట్లు తెలిపారు. ఆ పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. కాబట్టి.. వారి ప్రయోజనాలను ప్రభావితం చేయకూడదని అన్నారు. ఈ విషయాన్ని కోర్టు తన ఉత్తర్వుల్లో నమోదు చేసింది. మసీదు తరఫు న్యాయవాది కూడా కోర్టు వ్యాఖ్యలను బట్టి హైకోర్టు సర్వే దరఖాస్తును ముందుగా పరిగణించాలని భావించరాదని అన్నారు. ఈ విషయాలన్నింటినీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను తిరస్కరించింది.