Asianet News TeluguAsianet News Telugu

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధతకు నిరాకరణ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

భారతదేశంలోని స్వలింగ సంపర్కుల కమ్యూనిటీకి వివాహ సమానత్వ హక్కులను ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. 

Supreme Court refuses to give marriage equality rights to the LGBTQIA+ community in India ksm
Author
First Published Oct 17, 2023, 12:56 PM IST

భారతదేశంలోని స్వలింగ సంపర్కుల కమ్యూనిటీకి వివాహ సమానత్వ హక్కులను ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాల నిర్ణయం చట్టసభలదేనని తెలిపింది. క్వీర్ జంటలకు ఇవ్వగల హక్కులు,  ప్రయోజనాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటనను సుప్రీంకోర్టు నమోదు చేసింది. అలాగే లైంగిక ధోరణి ఆధారంగా ఒక వ్యక్తి యూనియన్‌లోకి ప్రవేశించే హక్కును పరిమితం చేయలేమని స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టు ప్రస్తుతం ఉన్న చట్టాలు లేదా వ్యక్తిగత చట్టాల ప్రకారం భిన్న లింగ సంబంధాలలో ఉన్న లింగమార్పిడి వ్యక్తులకు వివాహం చేసుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అదే సమయంలో.. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మసనం స్వలింగ సంపర్కుల జంటల దత్తత హక్కులపై ప్రధానంగా భిన్నమైన తీర్పులను వెలువరించారు. 

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ఎస్ కౌల్.. స్వలింగ సంపర్క జంటలు దత్తత తీసుకునే హక్కును కలిగి ఉంటారని పేర్కొనగా.. దానితో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలు విబేధించారు. దత్తత నుంచి స్వలింగ సంపర్క, అవివాహిత జంటలను మినహాయించే CARA నిబంధనలను సమర్థించారు. 

సీజేఐ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులలో నలుగురు.. క్వీర్ యూనియన్‌లోని వ్యక్తుల సంబంధాన్ని "వివాహం"గా చట్టబద్ధంగా గుర్తించకుండా.. వారి హక్కులు పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించేందుకు అంగీకరించారు. రేషన్ కార్డులలో క్వీర్ జంటలను కుటుంబంగా చేర్చడం, జాయింట్ బ్యాంక్ ఖాతా కోసం నామినేట్ చేయడానికి క్వీర్ జంటలను అనుమతించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుండి వచ్చే హక్కులు.. వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించాలని సీజేఐ పేర్కొన్నారు. కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలించాలని పేర్కొన్నారు. 

స్వలింగ సంపర్క జంటలు.. వస్తువులు, సేవలను పొందడంలో ఎలాంటి వివక్ష చూపకూడదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను  ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ డీవై చంద్రచూడ్ నిర్దేశించారు. క్వీర్ హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. క్వీర్ కమ్యూనిటీ కోసం హాట్‌లైన్‌ని సృష్టించడం, హింసను ఎదుర్కొనే క్వీర్ జంటల కోసం సురక్షిత గృహాలను 'గరిమా గృహ్' సృష్టించడం,  ఇంటర్-సెక్స్ పిల్లలు బలవంతంగా ఆపరేషన్‌లు చేయించుకోకుండా చూసుకోవాలని చెప్పారు. 

వారి సంబంధంపై క్వీర్ జంటపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని సీజేఐ పేర్కొన్నారు. ‘‘లైంగిక ధోరణి ఆధారంగా యూనియన్‌లోకి ప్రవేశించే హక్కును పరిమితం చేయలేము. భిన్న లింగ సంబంధాలలో ఉన్న లింగమార్పిడి వ్యక్తులు వ్యక్తిగత చట్టాలతో సహా ప్రస్తుత చట్టాల ప్రకారం వివాహం చేసుకునే హక్కును కలిగి ఉంటారు. క్వీర్ జంటలతో సహా అవివాహిత జంటలు సంయుక్తంగా బిడ్డను దత్తత తీసుకోవచ్చు’’ అని సీజేఐ పేర్కొన్నారు.

ఇక, ‘‘ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి కోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని అధికార విభజన సిద్ధాంతం అడ్డుకోదు. న్యాయస్థానం చట్టం చేయదు, కానీ దానిని అర్థం చేసుకుని అమలు చేయగలదు’’ అని సీజేఐ అన్నారు. స్వలింగ సంపర్కం, హోమో సెక్సువాలిటీ అనేది పట్టణ భావన కాదని.. సమాజంలోని ఉన్నత వర్గానికి మాత్రమే పరిమితం కాదని తెలిపారు. వివాహం స్థిరమైన, మార్పులేని సంస్థ అని చెప్పడం సరికాదని అన్నారు. ప్రత్యేక వివాహ చట్టాన్ని కొట్టివేస్తే.. అది దేశాన్ని స్వాతంత్ర్య పూర్వ యుగానికి తీసుకెళ్తుందని ఆయన అన్నారు.

ప్రత్యేక వివాహ చట్టం యొక్క పాలనలో మార్పు అవసరమా లేదా అనేది పార్లమెంటు నిర్ణయించాలని పేర్కొన్నారు. ఈ న్యాయస్థానం శాసనసభ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడాలి అని చెప్పారు. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని సమానత్వం డిమాండ్ చేస్తుందని సీజేఐ పేర్కొన్నారు. జీవిత భాగస్వామిని ఎన్నుకునే సామర్థ్యం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ మూలానికి వెళ్తుతుందని చెప్పారు. ‘‘జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది ఒకరి జీవిత గమనాన్ని ఎంచుకోవడంలో అంతర్భాగం. కొందరు దీనిని తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా భావించవచ్చు. ఈ హక్కు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ మూలానికి వెళుతుంది’’ అని పేర్కొన్నారు.

ఇక, ఈ అంశంపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. 10 రోజుల విచారణ తర్వాత తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. ఈ విచారణ సందర్భంగా పిటిషనర్లు తమ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని పట్టుబట్టారు. స్వలింగ సంపర్కులకు వివాహ హోదా ఇవ్వకుండా వారికి కొన్ని హక్కులను కల్పించడాన్ని పరిగణించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios