పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్‌లో టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీపై జరిగిన దాడి దేశంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.

దాడి ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ అడ్వకేట్ వివేక నారాయణ్ శర్మ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం అభ్యర్ధనను తిరస్కరిస్తూ...  కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. 

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్నందున, ఇలాంటి దాడి ఘటనల ప్రభావం ఎన్నికల యంత్రాంగంపై పడకుండా ఉండేందుకు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నారాయణ్ శర్మ కోరారు.

Also Read:నందిగ్రామ్‌లో మమతపై అటాక్: ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..?

ఇందుకు సంబంధించి ఒక తాత్కాలిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో వున్న వ్యక్తిపై దాడి జరిగినందున ఎన్నికల యంత్రాంగంపై ఓటర్ల విశ్వాసం సన్నగిల్లే అవకాశముందని వివేక్ కోర్టుకు తెలియజేశారు.

నందిగ్రామ్ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. నందిగ్రామ్‌లో జరిగిన ఘటనలో మమతా బెనర్జీ కాలికి తీవ్ర గాయమైంది.. ఈ దాడి వెనుక బీజేపీ ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించగా, వాటిని కమల నాథులు తోసిపుచ్చారు. సానుభూతి పొందడం కోసమే తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ కౌంటర్‌ వేసింది.