జమ్మూకాశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 9 పిటిషన్లపై జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ జరిపింది.

కేంద్రం నిర్ణయాన్ని తాము నిలిపివేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ వ్యాజ్యాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నాలుగు వారాల గడువునిచ్చింది. ఈ కేసుపై తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది.

కాగా జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఈ ఏడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దీంతో పాటు జమ్మూకాశ్మీర్‌ను రెండు ముక్కలు చేసింది. జమ్మూకాశ్మీర్‌‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా.. లఢఖ్‌ను శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విభజించింది.

మరోవైపు భారతప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్, లఢఖ్‌లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి.