Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ అల్లర్లు: పీఎం మోడీకి సుప్రీం క్లీన్ చిట్.. జాకియా జాఫ్రీ పిటిషన్ కొట్టివేత

గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు ప్రధాని, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి క్లీన్ చిట్‌‌ను ఇచ్చింది. అల్లర్లను దర్యాప్తు చేసిన సిట్, గుజరాత్ హైకోర్టులు మోడీకి ఇచ్చిన సిట్‌ను సమర్థించింది. ఈ కేసులను మళ్లీ దర్యాప్తు చేయడానికి పురికొల్పే లేదా కొత్త ఆధారాలేవీ లేవని పేర్కొంది.
 

supreme court confirms clean chit to narednra modi in gujarat riots
Author
New Delhi, First Published Jun 24, 2022, 1:21 PM IST

న్యూఢిల్లీ: గుజరాత్‌లో 2002లో మూడు రోజులపాటు జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ముస్లింలు లక్ష్యంగా దాడులు, అకృత్యాలు జరిగాయి. ఈ అల్లర్ల వెనుక పోలీసు అధికారులు, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సహా మొత్తం 64 మంది ప్రమేయం ఉన్నదని జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ ఎంపీ ఎహెసాన్ జాఫ్రీ భార్యనే జాకియా జాఫ్రీ.

ఈ అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేసింది. అల్లర్లు జరిగిన దశాబ్ద కాలం తర్వాత 2012లో దీనిపై సిట్ క్లోజర్ రిపోర్టు సమర్పించింది. అందులో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సహా పలువురుని నిర్దోషులుగా ప్రకటించింది. వారిని విచారించదగిన ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. గుజరాత్ హైకోర్టు కూడా నరేంద్ర మోడీతోపాటు మరో 63కి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ 2 గా తీస్తా సెతల్వాద్ ఉన్నారు.

సిట్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్థించాలని లేదంటే.. సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ కొన్ని ప్రయోజనాల కోసం కోర్టు.. ఎడతెగని విచారణకు ఆదేశించినట్టు అవుతుందని వాదించారు. కాగా, జాకియా జాఫ్రి తరఫున కపిల్ సిబల్ వాదిస్తూ.. సిట్ సరిగ్గా దర్యాప్తు చేయలేదని, కేవలం ముఖ్య కుట్రదారులను కాపాడటానికి సిట్ మరికొందరితో కలిసి పని చేసిందని ఆరోిపంచారు. ఈ సిట్ సభ్యులు, పోలీసు అధికారులకు అనంతరం మంచి మొత్తాలతో రివార్డులు సమర్పించారని తెలిపారు.

జస్టిస్ ఏఎం ఖాన్విల్కార్, జస్టిస్ దినేశ్ మహేశ్వరీ, జస్టిస్ సీటీ రవి కుమార్‌లు ఈ పిటిషన్‌పై గతేడాది డిసెంబర్‌లోనే తీర్పు రిజర్వ్‌లో పెట్టారు. తాజాగా, ఈ తీర్పు వెలువరించారు. జాకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌లో మెరిట్స్ లేవని పేర్కొంది. గుజరాత్ అల్లర్ల ఘట్టం ఎప్పుడూ మండుతూ ఉండటానికే పిటిషన్ వేసినట్టుగా ఉన్నదని తెలిపింది. ఈ పిటిషన్ వెనుక కొందరి ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్నట్టూ తెలుస్తున్నదని పేర్కొంది. 500కుపైగా ఉన్న ఈ పిటిషన్‌లో ఇతరుల వాదనలే ఎక్కువగా ఉన్నాయని, ఆ ఇతరుల వాదనల్లోనూ అబద్ధాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. జాకియా జాఫ్రీ ఇతరుల అభిప్రాయాలను తన పిటిషన్‌లో పొందుపరిచారని పేర్కొంది. అంతేకాదు, సిట్ సభ్యుల సిన్సియారిటీ, వారి సామర్థ్యాలను చిన్నవిగా చూపేలా ఈ పిటిషన్ ఉన్నదని వివరించింది. 

గుజరాత్ అల్లర్ల వెనుక లార్జర్ కాన్‌స్పిరసీ ఉన్నదని, ఆ కేసును మళ్లీ విచారించాలని పిటిషన్ డిమాండ్ చేస్తున్నదని, కానీ, ఈ ఘటనలను మళ్లీ విచారించడానికి పురికొల్పే కొత్త ఆధారాలు, విషయాలేమీ లేవని తెలిపింది. అందుకే జాకియా జాఫ్రీ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. అలాగే, సిట్, గుజరాత్ హైకోర్టు నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్ చిట్‌ను ధ్రువపరిచింది.

Follow Us:
Download App:
  • android
  • ios