సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనకు ఇల్లు, వాహనం, ఆభరణాలు సహా ఇతర స్థిర, చరాస్తులు లేవని తెలిపారు

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనకు ఇల్లు, వాహనం, ఆభరణాలు సహా ఇతర స్థిర, చరాస్తులు లేవని తెలిపారు.

రెండు బ్యాంక్ ఖాతాల్లో రూ.6.5 లక్షల నగదు, రూ.16 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, 1999లో తీసుకున్న రూ.5 లక్షల విలువైన ఎల్ఐసీ పాలసీలున్నాయన్నారు. వివాహ సమయంలో తన భార్యకు పుట్టింటి నుంచి వచ్చిన 150 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయని తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్ సీజేఐ ఆస్తుల వివరాలను పొందుపరిచారు.

అంతకుముందు భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు.. రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌.. జస్టిస్ గొగోయ్‌చే 46వ చీఫ్ జస్టిస్‌గా ప్రమాణం చేయించారు.

అసోం మాజీ ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్‌.. ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలివ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన ఈ పదవిలో 2019 నవంబర్ వరకు కొనసాగనున్నారు..