తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వంకు  సుప్రీంకోర్టులో  చుక్కెదురైంది.  మద్రాస్ హైకోర్టు తీర్పును  సుప్రీంకోర్టు సమర్ధించింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. అన్నాడిఎంకె కు సింగిల్ లీడర్ గా పళనిస్వామిని పునరుద్దరిస్తూ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అన్నాడిఎంకె లో పట్టు కోసం మాజీ ముఖ్యమంత్రులు పన్నీరు సెల్వం, పళనిస్వామిల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుంది. ఈ విషయమై రెండు వర్గాలు తమ ఆదిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి విషయమై రెండు వర్గాలు కోర్టులను ఆశ్రయించాయి. 

ఈ విషయమై గతంలో మద్రాస్ హైకోర్టు పళనిస్వామికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పన్నీరు సెల్వం సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. పళనిస్వామియే అన్నాడిఎంకె కు సింగిల్ నాయకుడు అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయమై మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

2022 లో పన్నీరు సెల్వం అభ్యర్ధనను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో అన్నాడిఎంకె సాధారణ కౌన్సిల్ సమావేశంలో పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 

మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పన్నీరు సెల్వం సహ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై ఇవాళ తీర్పును వెల్లడించింది. 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకెలో పదవుల కోసం గొడవలు ప్రారంభమయ్యాయి . అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైంది. అవినీతి ఆరోపణలతో శశికళ జైలుకు వెళ్లడంతో పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమయ్యారు. శశికళను అప్పట్లో పార్టీ నుండి బహిష్కరించారు. కొంతకాలం పాటు పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య మంచి సంబంధాలున్నాయి. రాష్ట్రంలో అన్నాడిఎంకె అధికారం కోల్పోయిన తర్వాత వీరిద్దరి మధ్య అంతరం పెరిగింది. ఈ అంతరం పార్టీ లో అధిపత్యం కోసం ప్రయత్నాలకు దారి తీశాయి.