బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన ఆర్ధిక నేరస్తుడు విజయ్ మాల్యా కేసులో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తన కుటుంబసభ్యుల ఆధీనంలోని కంపెనీల ఆస్తులు జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ మాల్యా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు..

మాల్యా తరపున శుక్రవారం సీనియర్ న్యాయవాది ఎఫ్ఎన్ నారీమన్ వాదనలు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మినహా, ఇతర సంస్థలపై కేసులు లేనందున వాటిని జప్తు చేయడం సరికాదని నారీమన్.. ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కేసులో తదుపరి విచారణను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలోని బెంచ్ ఆగస్టు 13కు వాయిదా వేసింది. రుణాలు తిరిగి చెల్లిస్తానన్నా తనను ఏజెన్సీలు వేధిస్తున్నాయంటూ విజయ్ మాల్యా గతంలోనూ పలుమార్లు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వాపోయారు. ఇటీవల కేప్ కాఫీ డే అధినేత సిద్ధార్ధ్ ఆత్మహత్యపై స్పందిస్తూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.