సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆయన స్టైల్‌గా నడిచి వస్తే.. రికార్డులు రజనీ వెంట పరుగులు తీయాల్సిందే.. మనదేశంలోనూ కాదు.. విదేశాల్లోనూ ఆయనకు ప్రాణాలిచ్చే అభిమానులున్నారు.. భారత్‌లో అత్యధిక ఆదాయాన్ని అందుకునే స్టార్‌గా రికార్డుల్లోకి ఎక్కినా.. తలైవాగా మన్ననలు అందుకున్నా రజనీకి సాటిరాగల వారు దరదాపుల్లో లేరు.. అంతటి సూపర్ స్టార్ అయినా నిజ జీవితంలో నిరాడంబరంగా జీవించడం రజనీని మరింత మందికి దగ్గర చేసింది. అందుకే ఆయనను సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా గుండెల్లో దాచుకున్నారు. నాలుగు దశాబ్ధాల నట జీవితంలో ఎన్నో అవార్డులు.. రివార్డులు ఉన్నాయి.. తాజాగా ఆయన కీర్తికీరిటంలో మరో కలికితురాయి చేరింది.

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఉన్న ప్రఖ్యాత నహార్ గఢ్ కోట మ్యూజియంలో రజనీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ కోట నిర్వాహకులు. ఈ విగ్రహం బరువు 55 కిలోగా.. ఎత్తు 5.9 అడుగులు..  రజనీ విగ్రహంతో కలిపి ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన విగ్రహాల సంఖ్య 36.. ఇవి ఏర్పరచడానికి ముఖ్య కారణం పర్యాటకుల్లో స్పూర్తిని నింపడమే..  ఇటీవల ఏర్పాటు చేసిన హాకీ దిగ్గజం సందీప్ సింగ్ విగ్రహం ఎందరిలోనో స్పూర్తిని కలిగించింది.. ఒక బస్ కండక్టర్‌‌గా జీవితాన్ని ప్రారంభించి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీ జీవితం ఎందరికో ఆదర్శం.. ఈ కోటను సందర్శించడానికి దక్షిణ భారతదేశం నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉండటంతో వారిలో కొద్దిమందైనా రజనీ నుంచి స్పూర్తి పొందుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా సినీరంగం నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ విగ్రహాలు ఏర్పాటు చేయగా.. అతి త్వరలో సల్మాన్, షారూఖ్, అమీర్ ఖాన్‌ల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. అన్నట్లు.. రజనీ విగ్రహాన్ని తయారు చేసేందుకు... శిల్పులు వ్యాంగ్ పింగ్, సుశాంత రే మూడు నెలల పాటు కష్టపడ్డారట.