Asianet News TeluguAsianet News Telugu

సుపారీ ఇచ్చి హత్యాయత్నం.. మహిళా మెజిస్ట్రేట్, లేడీ ఎస్సైల ప్రమేయం..

ఓ మహిళా మెజిస్ట్రేట్ ఓ వ్యక్తి మీద సుపారీ ఇచ్చి హత్యాయత్నం చేయించింది. ఈ మేరకు సాక్ష్యాధారులు దొరికాయి. ఆమెతో పాటు మహిళా ఎస్సై మీద కూడా ఆరోపణలు వచ్చాయి. 

supari murder Attempt.. Female Magistrate and Lady SI are involved in Visakhapatnam
Author
Hyderabad, First Published Jul 6, 2022, 8:37 AM IST

విశాఖపట్నం : విశాఖపట్నానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెంకా రాజేష్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో భీమిలి మెజిస్ట్రేట్ విజయలక్ష్మి, ఆమె సోదరి, నగరంలో ఎస్సైగా పనిచేస్తున్న నాగమణి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఈ నెల మూడో తేదీన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మహారాణిపేట ఎస్ఐ సోమశేఖర్ ఈ విషయాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. నగరంలో కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉంటున్న పెంకా రాజేష్ (39),  ఇది గతనెల 18న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెనకనుంచి ఇనుప రాడ్ తో దాడి చేశారు.

బాధితుడి వాంగ్మూలం ప్రకారం మహారాణి పేట పోలీసులు ఘటనా స్థలంలోనే సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన దర్యాప్తును వేగవంతం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఉపయోగించి బైక్ ఆధారంగా.. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన రామస్వామి, రాజు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిద్దరూ నేరాన్ని అంగీకరించారు. అయితే బాధితుడితో తమకు ఎలాంటి పరిచయము లేదని తమకు Supari ఇస్తామని అప్పల రెడ్డి,  తరుణ్ అనే వ్యక్తులు చెప్పడంతోనే అలా చేశామని తెలిపారు. తరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.  

ఈ విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  భీమిలిలోని తోట వీధికి చెందిన మరుపల్లి తరుణ్ కుమార్ కు రెండు నెలల కింద చిప్పాడకు చెందిన భీమిలి మెజిస్ట్రేట్ విజయలక్ష్మి వద్ద  కారు డ్రైవర్గా పనిచేస్తున్న అప్పల రెడ్డి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతోనే నాలుగు రోజుల తర్వాత తరుణ్కు అప్పల రెడ్డి వాట్స్అప్ కాల్ చేశాడు. మెజిస్ట్రేట్ కు ఒకరు డబ్బులు ఇవ్వాలని ఎంత అడిగినా ఇవ్వకపోగా, తిరిగి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని చెప్పాడు. ఆ తర్వాత భీమిలి బీచ్ రోడ్డుకు పిలిచి అక్కడ  తరుణ్ కు 30,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. తర్వాత ఆనందపురంలో ఉంటున్నమెజిస్ట్రేట్ విజయలక్ష్మి ఇంటికి తీసుకువెళ్లి ఆమెను పరిచయం చేశాడు. 

కి‘లేడి’.. మేకప్ తో మాయచేసి.. ముగ్గురిని వివాహమాడి.. భర్త, అత్తకు చుక్కలు చూపించి.. చివరికి ఆధార్ కార్డుతో...

ఆ తర్వాత విజయలక్ష్మి నేరుగా తన ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ చేసి రాజేష్ ని చంపేపని ఎంతవరకు వచ్చింది? అని.. అప్పల రెడ్డి కలిశాడా?  అంటూ అడిగేవారు. ఈ నేపథ్యంలో తరుణ్, అప్పలరెడ్డి కలిసి కోస్టల్ బ్యాటరీ పరిసరాల్లో గల పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లారు. అక్కడ రామస్వామి అనే వ్యక్తిని కలిశారు. రాజేష్ ఫోటో, ఇల్లు  చూపించి అతడిని చంపేస్తే డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రామస్వామి తనకు పరిచయస్తుడు అయిన రాజు అనే యువకుడు సహాయం తీసుకుని రాజేష్ హత్యకు పలుమార్లు రెక్కీ చేశాడు. చివరికి గతనెల 18న  అమలు చేశారు. 

ఆ రోజు రాజేష్ ఒంటరిగా స్కూటీ మీద ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇదే అదనుగా  తీసుకున్న వాళ్ళు రాడ్డు, సుత్తి కొనుగోలు చేసి బైక్ను వెంబడించారు. కలెక్టరేట్ డౌన్ లో రాజేష్ తన అపార్ట్ మెంట్ లోకి వెళ్లే సమయంలో రామస్వామి రాడ్ తో తలపై గట్టిగా మోదాడు. మరోవైపు తనను వేధిస్తున్నాడని విజయలక్ష్మి తన సోదరి నాగమణికి  చెప్పడంతో.. ఆమె  అతడికి పలుమార్లు ఫోన్ చేసి బెదిరించింది. ఘటన తర్వాత నిందితులను అనంతపురంలో తన వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్ వుడికుల ప్రమోద్ కుమార్ (35) ఇంటి పక్కన దాచారు. నిందితులతో పాటు విజయలక్ష్మి, నాగమణి సెల్ ఫోన్ కాల్ రికార్డు, టవర్ లొకేషన్ లు కూడా సరిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల ఒకటవ తేదీన రామస్వామి, రాజులను అరెస్ట్ చేశారు. ఆ తరువాత 3న తరుణ్ కుమార్, కానిస్టేబుల్  ప్రమోద్ కుమార్ అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios