ఆదివారం పవిత్రదినం.. ఓట్ల లెక్కింపు తేదీని మార్చండి.. ఎన్నికల సంఘానికి పార్టీల విజ్ఞప్తి
ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు తేదీ డిసెంబర్ 3వ తేదీ అంటే ఆదివారం నిర్ణయించింది. క్రైస్తవులు మెజార్టీగా ఉండే మిజోరంలో ఆదివారం పవిత్రమైన రోజు అని, కాబట్టి, కౌంటింగ్‌ను వాయిదా వేయాలని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అధికార ఎంఎన్ఎఫ్, జోరం పీపుల్స్ మూవ్‌మెంట్, పీపుల్స్ కాన్ఫరెన్స్ సహా పలుపార్టీలు ఈసీకి లేఖ రాసి విజ్ఞప్తి చేశాయి.
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల నుంచి మరో విజ్ఞప్తి అందింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని రీషెడ్యూల్ చేయాలని, నవంబర్ 23వ తేదీన పెద్ద ఎత్తున పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పార్టీలు ఈసీని కోరిన సంగతి తెలిసిందే. పార్టీల విజ్ఞప్తిని అంగీకరించిన ఈసీ రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా, ఇలాంటి విజ్ఞప్తి మరొకటి ఎన్నికల సంఘానికి వచ్చింది. ఈ సారి ఎన్నికల తేదీ కాదు, కౌంటింగ్ డేట్‌ను రీషెడ్యూల్ చేయాలని మిజోరం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈసీని కోరాయి.
ఆదివారం పవిత్ర దినం అని, రాష్ట్ర ప్రజలందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉంటారని, కాబట్టి, ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని ఎన్నికల సంఘాన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. సోమవారం నుంచి శుక్రవారం నడుమ ఏ వారంలో ఓట్లను లెక్కించినా తమకు అభ్యంతరం లేదని సూచనలు చేశాయి.
క్రిస్టియన్ మెజార్టీ రాష్ట్రమైన మిజోరంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విజ్ఞప్తిని ఎన్నికల సంఘానికి చేశాయి. షెడ్యూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీన అంటే ఆదివారం ఉన్నదని, కానీ, ఆదివారం రాష్ట్ర ప్రజలకు పవిత్రమైన రోజు అని తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్, అధికారిక ఎంఎన్ఎఫ్ సహా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్, పీపుల్స్ కాన్ఫరెన్స్‌లు కూడా ఈసీకి లేఖ రాసి విజ్ఞప్తి చేశాయి. రాజకీయ పార్టీలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన చర్చీల మిజోరం కోహరన్ రువైటుట్ కమిటీ కూడా ఈసీకి లేఖ రాసి కౌంటింగ్ డేట్‌ను మార్చాలని కోరింది. ఆదివారం క్రైస్తవులందరికీ పవిత్రమైన రోజు అని, ఆ రోజు పట్టణాలు, గ్రామాల్లో అందరూ ఆధ్యాత్మిక సేవల్లోనే ఉంటారని తెలిపింది.
Also Read: విదేశీ గడ్డపై ఒక్కొక్కరుగా హతమవుతున్న భారత శత్రువులు.. నిజ్జర్ మొదలు షాహిద్ లతీఫ్ వరకు..!
ఫలితాల తేదీని వాయిదా వేయాలని బీజేపీ, లెక్కింపు డిసెంబర్ 4వ తేదీన చేపట్టాలని ఎంఎన్ఎఫ్, సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఎప్పడైనా కౌంటింగ్ డేట్‌ను ఫిక్స్ చేయాలని కాంగ్రెస్ కోరింది.