విదేశీ గడ్డపై ఒక్కొక్కరుగా హతమవుతున్న భారత శత్రువులు.. నిజ్జర్ మొదలు షాహిద్ లతీఫ్ వరకు..!
భారత శత్రువులు ఒక్కొక్కరుగా విదేశీ గడ్డపై హత్యకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ హత్యలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని సాయుధులు వీరిని మట్టుబెడుతున్నారు. పాకిస్తాన్ మొదలు కెనడా, నేపాల్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
న్యూఢిల్లీ: మన దేశంలో పఠాన్ కోట్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై 2016లో జరిగిన దాడి కుట్రదారు, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో బుధవారం చంపేశారు. విదేశీ గడ్డపై మరణించిన భారత శత్రువుల జాబితాలో షాహిద్ లతీఫ్ కూడా చేరారు. ఈ జాబితాను ఒక సారి చూద్దాం.
సియాల్‌కోట్‌లో లతీఫ్:
జైషే మొహమ్మద్ తీవ్రవాది షాహిద్ లతీఫ్ 2016 పఠాన్‌కోట్ దాడి(ఈ ఘటనలో ఏడుగురు ఏఐఎఫ్ సిబ్బంది మరణించారు) మాస్టర్ మైండ్‌గా భావిస్తారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న లతీఫ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సియాల్‌కోట్ జిల్లాలో డస్కా పట్టణంలోని ఓ మసీదులో చంపేసి వెళ్లిపోయారు.
పీవోకేలో రియాజ్ అహ్మద్:
లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసీం. 2023 జనవరిలో జరిగిన ధాంగ్రి ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడు. రజౌరీలో జరిగిన ఈ దాడిలో ఏడుగురు మరణించగా 14 మంది గాయపడ్డారు. సెప్టెంబర్‌లో రియాజ్ అహ్మద్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కట్‌లో అల్ కుదుస్ మసీదులో రియాజ్ హత్య జరిగింది.
కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్:
హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం 2020లో తీవ్రవాదిగా గుర్తించింది. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సంస్థలోకి పలువురిని రిక్రూట్ చేయడంలో క్రియాశీలకంగా ఉన్నట్టు కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు తెలిపాయి. వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్‌లోనూ ఆయన భాగంగా ఉన్నారు. కెనడాలోని సర్రేలో ఓ గురుద్వార వెలుపల జూన్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.
Also Read: కుల గణన డిమాండ్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఏమన్నారంటే?
రావల్పిండిలో బషీర్ అహ్మద్ పీర్:
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్త కమాండర్ బషీర్ అహ్మద్ పీర్. ఈ సంస్థలోకి అమాయకులను రిక్రూట్ చేయడం, జమ్ము కశ్మీర్‌లోకి అక్రమంగా వారిని చొరబెట్టడం వంటివాటికి బాధ్యుడు. ఈ ఏడాది మొదట్లోనే రావల్పిండిలోని ఓ షాప్ బయట గుర్తు తెలియని సాయుధులు బషీర్ అహ్మద్ పీర్‌ను చంపేసి వెళ్లిపోయారు.
కరాచీలో సయ్యద్ ఖాలిద్ రజా:
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ అల్ బదర్ కమాండర్ సయ్యద్ ఖాలిద్ రజాను కరాచీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొందరు సాయుధులు కాల్చి చంపారు.
కరాచీలో మిస్త్రీ జమూర్ ఇబ్రహీం:
ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసి 1999 డిసెంబర్ 24వ తేదీన కాందహార్‌కు తీసుకెళ్లిన హైజాకర్లలో మిస్త్రీ జహూర్ ఇబ్రహీం ఒకడు. బైక్ పై వచ్చిన కొందరు కారచీలో ఇబ్రహీంను చంపేశారు.
Also Read: కస్టడీలోని నిందితుడు పోలీసు కారుతో పరార్.. కొద్ది దూరం తర్వాత కారు వదిలాడు.. కానీ!
లాహోర్‌లో పరంజీమ్ సింగ్ పన్వార్:
తీవ్రవాది, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజీత్ సింగ్ పన్వార్‌ను పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఈ ఏడాది మే నెలలో ఇద్దరు సాయుధులు చంపేశారు. సిక్కుల తిరుగుబాటకు పునరుజ్జీవం పోసిన వారిలో పరంజీత్ సింగ్ పన్వార్ ఒకడు. మర్డర్, కిడ్నాప్, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు.
ఖాట్మండులో లాల్ మొహమ్మద్:
పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీ నేపాల్‌లోని ఖాట్మండులో సెప్టెంబర్ 19న ఆయన డెన్ బయటే హత్యకు గురయ్యాడు. ఐఎస్ఐ నకిలీ నోట్లను భారత్‌లోకి పెద్ద ఎత్తున రవాణా చేశాడని ఈయనపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఆరోపణలు ఉన్నాయి.