మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్ ఆదివారం తన స్నేహితురాలు, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పాడు. వచ్చే ఏడాది ఈస్టర్ నీకు ప్రత్యేకమైనదిగా చేస్తానంటూ ఆయన లేఖలో పేర్కొన్నాడు.
మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్.. కారాగారంలో వున్నప్పటికీ కల్లోలం రేపుతున్నాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను ప్రస్తావిస్తూ వరుసగా లేఖలు విడుదల చేస్తున్నాడు. ఇప్పటి వరకు చేసింది ట్రైలరేనని.. రాబోయే రోజుల్లో అసలు బ్లాక్ బస్టర్ వుంటుందని హెచ్చరిస్తున్నాడు. తాజాగా తన స్నేహితురాలు, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుఖేష్.. ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పాడు. ‘‘మై బేబీ, మై బొమ్మ’’ అని సంబోధిస్తూ ఈ పర్వదినం సందర్భంగా జాక్వెలిన్‌తో వుండలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశాడు. తదుపరి ఈస్టర్‌ను మాత్రం ఎప్పటికీ ది బెస్ట్‌గా మారుస్తానని అతను హామీ ఇచ్చాడు. ఈ గ్రహం మీద నీ అంత అందంగా ఎవ్వరూ వుండరు.. ఐ లవ్యూ అంటూ సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇక చివరిలో జాక్వెలిన్ తల్లిదండ్రులకు కూడా అతను శుభాకాంక్షలు తెలిపాడు.
కాగా.. 200 కోట్ల విలువైన మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన నిందితడు. రాన్‌బాక్సీ మాజీ యజమాని శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్‌ను మోసం చేసినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఇదిలావుండగా.. ఇదే కేసులో జాక్వెలిన్‌పైనా పలు అభియోగాలు నమోదు చేసింది ఈడీ. అయితే ఆమె వీటిని ఖండించింది. మరో కేసులో జాక్వెలిన్ కోర్టు ఎదుట విచారణకు హాజరవ్వగా.. ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Also Read: బీఆర్ఎస్ నేతకు 15 కోట్లు ఇచ్చా, ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ : బ్లాక్‌బస్టర్ ముందుంది.. సుఖేష్ లేఖ
ఇకపోతే.. ఏప్రిల్ 6న తీహార్ జైలు నుంచి సుఖేష్ .. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచన మేరకు తాను బీఆర్ఎస్ ఆఫీసులో ఆ పార్టీ నేతకు రూ.15 కోట్లు ఇచ్చానని చెప్పాడు. అంతేకాకుండా బీఆర్ఎస్ లీడర్‌తో జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా లేఖలో ప్రస్తావించాడు. తనతో చాట్ చేసిన వ్యక్తి సౌత్ గ్రూప్‌లో వున్న బీఆర్ఎస్ లీడర్‌గా తెలుస్తోందన్నాడు. ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో రేంజ్ రోవర్ (కారు నెం 6069) పార్క్ చేసి వుందని సుఖేష్ అన్నాడు. ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ వుందని చెప్పాడు. ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని స్పష్టం చేశాడు. అవసరమైతే తాను నార్కో టెస్ట్‌కు సిద్ధమని సుఖేష్ ప్రకటించాడు. ఇది టీజరేనన్న ఆయన అసలైన బ్లాక్ బస్టర్ ముందుందని కేజ్రీవాల్‌ను హెచ్చరించాడు.
ఇటీవల సుఖేష్ లాయర్ అనంత్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చేవారం సుఖేష్ మరో సంచలనం బయటపెడతారని అన్నారు. జైలు నుంచి ఇప్పటి వరకు ఆయన 12 లేఖలు రాశారని.. వీటిలో కొన్ని లేఖలపై హైపవర్ కమిటీ దర్యాప్తు చేస్తోందని అనంత్ మాలిక్ తెలిపారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి సుఖేష్ పనిచేశారని అనంత్ చెప్పారు.
