శనివారం మరో లేఖను విడుదల చేశాడు సుఖేష్ చంద్రశేఖర్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఫర్నిచర్‌ను తానే కొనుగోలు చేశానని.. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు వున్నాయని ఢిల్లీ ఎల్జీకి ఫిర్యాదు చేశాడు. 

మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్.. కటకటాల వెనక్కి వెళ్లాక కూడా తగ్గడం లేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితలను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కూడా సంచలన ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా శనివారం మరో లేఖను విడుదల చేశాడు సుఖేష్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురించి ప్రస్తావిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తన లాయర్ ద్వారా లేఖను రాశాడు . తన లేఖను పరిగణనలోనికి తీసుకోవాలని సుకేష్ తరపు న్యాయవాది అనంత్ మాలిక్ .. ఎల్జీని కోరారు. 

కేజ్రీవాల్ తన నివాసం కోసం అత్యాధునిక ఫర్నిచర్‌ను కోరుకున్నారని.. కేజ్రీవాల్‌, సత్యేంద్ర జైన్‌లు ఇద్దరూ కలిసి ఫర్నిచర్ ఫోటోలు తనకు షేర్ చేశారని ఆరోపించాడు. సీఎం ఇంటికి కావాల్సిన ఫర్నిచర్‌ను తానే కొనుగోలు చేశానని ఇందుకోసం రూ.1.70 కోట్లు ఖర్చు చేసినట్లు సుఖేష్ తెలిపాడు. ఇందులో డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్స్, అద్దాలు, బెడ్ రూం సామాగ్రి, వాల్ క్లాక్‌లు వున్నాయని చెప్పాడు. వీటిని తన సిబ్బందిలో ఒకరైన రిషబ్ శెట్టి ద్వారా కేజ్రీవాల్ నివాసానికి డెలివరీ చేశానని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి కేజ్రీవాల్‌తో జరిగిన వాట్సాప్ సంభాషణలు, తదితర వివరాలు తన వద్ద వున్నాయని చెప్పాడు. ఫర్నిచర్ కొనుగోలుపై దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాలని సుఖేష్ కోరాడు. 

ALso Read: మీరూ దొంగలే.. వెల్‌కమ్ టూ తీహార్ క్లబ్ : సుఖేష్ మరో సంచలనం, ఈసారి కవిత ఫోన్ నెంబర్లు సహా

ఇకపోతే కొద్దిరోజుల క్రితం 5 పేజీల లేఖను ఆయన విడుదల చేశారు. ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ నెంబర్లు వున్న ‘‘స్క్రీన్ షాట్స్’’ను ఆయన విడుదల చేశారు. ‘‘తీహార్ క్లబ్’’కు వస్తున్నారంటూ కవిత, కేజ్రీవాల్‌కు సుఖేష్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. అతి త్వరలోనే కేజ్రీవాల్‌తో జరిపిన చాట్స్‌ను విడుదల చేస్తానంటూ ఆయన బాంబు పేల్చారు. ట్విట్టర్ల ద్వారా సమాధానాల ఇవ్వొద్దన్న సుఖేష్.. ఇవన్నీ పాత ట్రిక్కులని పనిచేయవని వ్యాఖ్యానించాడు. 

తనను దొంగ, ఆర్ధిక నేరగాడిని అంటూ విమర్శించారని, మీరు కూడా అందులో భాగస్వాములేనంటూ సుఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం వుంటే సరైన రీతలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సుఖేష్ చంద్రశేఖర్ సవాల్ విసిరారు. కవతను కవితక్క అని సంబోధించానని, ఆమెను తన పెద్దక్కగా భావించానని ఆయన చెప్పాడు. దేశ ప్రజా ప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడాలని సుఖేష్ హితవు పలికాడు. తనను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు అర్ధరహితమని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశాడు.