Asianet News TeluguAsianet News Telugu

మాతృభాషలో చదివితేనే విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుంది - కేంద్ర హోం మంత్రి అమిత్ షా

మాతృభాషలో చదివితే విద్యార్థుల్లో శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థికి ఈ అవకాశం లభిస్తుందని చెప్పారు. గుజరాత్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

Studying in mother tongue will improve students' ability - Union Home Minister Amit Shah
Author
First Published Dec 25, 2022, 10:06 AM IST

విద్యార్థి మాతృభాషలో చదివితే అతడిలో సామర్థ్యం పెరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సొంత భాషలో చదవడం, మాట్లాడడం, ఆలోచించడం వంటివి చేస్తే తార్కిక శక్తి మెరుగవుతుందని చెప్పారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో విజాపూర్ నగరంలోని షెథ్ జీసీ హైస్కూల్ లో శనివారం నిర్వహించిన 95వ వార్షికోత్సవంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. సాంకేతిక, వైద్య, ఉన్నత విద్యా కోర్సుల సిలబస్‌లను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే పని జరుగుతోందని చెప్పారు.

వాజ్‌పేయి జయంతి‌: సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ..

నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) వచ్చే 25 ఏళ్లలో విద్యారంగంలో భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలబెడుతుందని చెప్పారు. ‘‘ఎన్ఈపీలో తీసుకొస్తున్న ముఖ్యమైన మార్పు ఏంటంటే.. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు వీలైనంత వరకు వారి మాతృభాషలో విద్యను అందించడం. రాబోయే కొన్నేళ్లలో దేశంలోని విద్యార్థులందరికీ వారి మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుందని, వారి తల్లులు వారికి మాతృభాషలోనే బోధించగలరనే నమ్మకం నాకు ఉంది’’ అని అన్నారు.

సాంకేతిక, వైద్య, ఉన్నత విద్యకు సంబంధించిన సిలబస్‌లను మాతృభాషలోకి అనువదిస్తున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు. భోపాల్ లో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ సిలబస్ హిందీలోకి అనువాదం చేశారని, ఇప్పుడు దానిని ఆ భాషలోనే బోధిస్తున్నారని చెప్పారు. “ త్వరలోనే గుజరాతీ, తెలుగు, ఒడియా, పంజాబీ, బెంగాలీ భాషల్లో ఉన్నత వైద్య విద్యా కోర్సులు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి భారతదేశం పరిశోధన, అభివృద్ధికి గణనీయమైన సహకారం అందడం ప్రారంభమవుతుంది.” అని ఆయన అన్నారు.

కరోనాను ఎదుర్కోవడానికి సన్నాహాలు.. డిసెంబర్ 27 న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్

ఓ వ్యక్తి తాను చదువుతున్న సబ్జెక్టు తన మాతృభాషలో బోధన జరిగినప్పుడు మరింత నేర్చుకుంటాడని అమిత్ షా అన్నారు. కొత్త ఆలోచనలు వస్తాయని చెప్పారు. నూతన విద్యా విధానంలో కళ, సంగీతంతో పాటు పిల్లల స్వాభావిక సామర్థ్యాలకు వేదికను అందించడంలో సాయపడుతుందని తెలిపారు. “స్వాతంత్రం రాక ముందు నుంచి బ్రిటీష్ విద్యా విధానం కొనసాగుతోంది. ఇందులో బట్టీ పట్టడమే తెలివితేటలకు సంకేతం. ఆలోచన, పరిశోధన, తర్కం, విశ్లేషణ, నిర్ణయం తీసుకునే, అర్థం చేసుకునే శక్తిని అందించలేదు.ఇది సమాజంలో అనేక సమస్యలను సృష్టించింది.’’ అని ఆయన అన్నారు. 

ఇదిలా ఉండగా.. రాజ్‌కోట్‌లోని స్వామినారాయణ గురుకులంలో శనివారం నిర్వహించిన  75వ ‘అమృత్ మహోత్సవ్’లో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఎన్‌ఈపీ-2020 ద్వారా దేశంలోనే తొలిసారిగా దార్శనికతతో కూడిన, భవిష్యత్తు ఆధారిత విద్యా వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. 2014 తర్వాత దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగాయని అన్నారు.

రాష్ట్రాల మధ్య భగ్గుమంటున్న సరిహద్దు వివాదం.. ఇరు రాష్ట్రాల అగ్రనాయకత్వాల మధ్య వాగ్వాదం..

“భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తును అందించడానికి మా ప్రస్తుత విద్యా విధానం, సంస్థలు పెద్ద పాత్ర పోషిస్తాయని మీకు బాగా తెలుసు. ఈ స్వాతంత్ర్య 'అమృత్‌కాల్'లో విద్యా మౌలిక సదుపాయాల్లో, విద్యా విధానంలో మేము పాలుపంచుకుంటాము. మేము ప్రతి స్థాయిలో పని చేస్తున్నాము.’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేడు దేశంలో ఐఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి పెద్ద విద్యాసంస్థల సంఖ్య పెరుగుతోందని ప్రధాని తెలిపారు. 2014 తర్వాత దేశంలో మెడికల్ కాలేజీలు 65 శాతానికి పైగా పెరిగాయని ప్రధాని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios