దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ‌లతో సహా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. 

దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ‌లతో సహా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ రోజు ఉదయం వాజ్‌పేయి స్మారక కేంద్రం సదైవ్ అటల్ వద్దకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్.. ఆయన సమాధి వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. భారతదేశానికి వాజ్‌పేయి చేసిన కృషి మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. 

‘‘అటల్ జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. భారతదేశానికి ఆయన చేసిన కృషి చెరగనిది. ఆయన నాయకత్వం, దార్శనికత లక్షలాది మంది ప్రజలను చైతన్యపరుస్తాయి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఇక, స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. బనారస్ హిందూ యూనివర్శిటీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన మాలవ్య విద్యా రంగాన్ని సాధికారత సాధించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని.. ఇందుకు ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ పేర్కొన్నారు. ఆయన భారతమాతకు గొప్ప బిడ్డ అని మోదీ అన్నారు.

ఇక, అటల్ బిహారీ వాజ్‌పేయి భారత రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ముద్రను వేశారు. అజాత శత్రువుగా పేరుపొందారు. వాజ్‌పేయి ఆరేళ్లపాటు భారత ప్రధానిగా కొనసాగారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా నేడు (డిసెంబర్ 25) సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జవాబుదారీతనంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.