Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వివక్ష.. దళిత మహిళ వండిన భోజనాన్ని తిరస్కరించిన విద్యార్థులు.. కలెక్టర్ ఏం చేశాడంటే?

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వివక్ష బుసలు కొట్టింది. దళిత మహిళ వంట చేసిందని అగ్రవర్ణ విద్యార్థులు కొందరు ఆ భోజనం చేయబోమని తిరస్కరించారు. స్కూల్ ప్రిన్సిపాల్ పలువిధాలుగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ కూడా ఆ స్కూల్‌కు వచ్చి విద్యార్థులందరితో కలిసి భోజనం చేశారు. గతేడాది ఇదే స్కూల్‌లో దళిత మహిళ వండిన భోజనం తినబోమని అగ్రవర్ణ విద్యార్థులు పేర్కొన్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

students refuse midday meal prepared by dalit woman in uttarakhand
Author
New Delhi, First Published May 21, 2022, 3:07 PM IST

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో మరోసారి దళిత మహిళకు వివక్ష ఎదురైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా దళిత మహిళ వండిన భోజనాన్ని తాము తినబోమని కొందరు అగ్రవర్ణాల విద్యార్థులు తిరస్కరించడం కలకలం రేపింది. కొన్ని నెలల క్రితం అదే స్కూల్‌లో ఈ వివాదం రగిలి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దళిత మహిళ సునితా దేవీ వండిన వంటను తాము తినబోమని స్కూల్‌లోని మొత్తం 37 మంది అగ్రవర్ణాల విద్యార్థుల్లో తొమ్మిది నుంచి పది మంది తిరస్కరించారని ప్రిన్సిపాల్ శుక్రవారం వెల్లడించారు.

ఇలాంటి వివక్ష సరికాదని, స్కూల్‌లో సత్ప్రవర్తన కలిగి ఉండాలని, సంయమనం పాటించాలని, వివక్షను విడనాడాలని ఆయన వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వారు ఈ మాటలను పెడ చెవిన పెట్టారు. దీంతో తాను ఆ ఏడుగురు విద్యార్థులకు టీసీ ఇచ్చి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రేమ్ సింగ్ తెలిపారు. ఈ స్కూల్ చంపావత్ జిల్లా సుఖిదాంగ్‌లో ఉన్నది.

తాను ఆ అగ్రవర్ణాల విద్యార్థుల పేర్లు తొలగించలేదని, ఈ స్కూల్‌లో దళిత మహిళ వండిన భోజనాన్ని తినడానికి నిరాకరించిన ఆ విద్యార్థులకు టీసీనీ కేవలం వార్నింగ్ కోసమే జారీ చేశానని వివరించారు. తద్వారా వారు దళిత మహిళ వండిన వంటను నిషేధించడానికి స్వస్తి పలుకుతారని ఆశించానని తెలిపారు. స్కూల్‌లో అన్ని వర్గాల మధ్య సఖ్యత ఉండాలనేది తన అభిమతం అని వివరించారు.

ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో చంపావత్ జిల్లా మెజిస్ట్రేట్ నరేంద్ర సింగ్ బండారి, మరికొందరు విద్యా శాఖకు చెందిన సీనియర్ నేతలతో కలిసి ఆ స్కూల్‌కు వెళ్లారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. అక్కడ విద్యార్థులు అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టర్‌తో పాటు విద్యార్థులు అందరూ భోజనం చేశారు. స్కూల్‌లో వండిన భోజనం తినకపోవడం నేరం ఏమీ కాదని విద్యా శాఖ ఉన్నత అధికారి జితేంద్ర సక్సేనా అన్నారు. కానీ, వారు ఇంటి నుంచి ఆహారం తెచ్చుకున్నా.. పాఠశాలలో వాతావరణం చెడగొట్టకుండా అక్కడ వండిన కనీసం పప్పు, ఇతర కూరలనైనా వేసుకుని తినాలని పేర్కొన్నారు. తమ సూచనలను ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించారని సక్సేనా తెలిపారు. విద్యార్థులు అందరూ జిల్లా మెజిస్ట్రేట్‌తో కలిసి భోజనం చేశారని వివరించారు. 

సుమారు ఆరు నెలల క్రితం ఇదే స్కూల్‌లో సునితా దేవి వండిన వంటను దాదాపు 40 మంది అగ్రవర్ణ విద్యార్థులు తినలేదు. దళిత మహిళ వండిన వంటను తాము తినబోమని కరాఖండిగా చెప్పేశారు. ఆ తర్వాతి రోజే స్కూల్ యాజమాన్యం.. సునితా దేవిని వంట పనిలో నుంచి తొలగించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత తెచ్చింది. దీంతో సునితా దేవిని మళ్లీ పనిలో పెట్టుకుంది.

తాజా ఘటనపై సునితా దేవి మాట్లాడుతూ, తాను వండిన వంటను తినవద్దని పిల్లలకు గ్రామస్తులే చెప్పారని ఆరోపించారు. ఇది తన ఆత్మగౌరవానికి వ్యతిరేకం అని, ఆ విద్యార్థులు తనను అవమానించడానికి అన్ని ప్రయత్నాలూ చేశారని పేర్కొన్నారు. తాను తన ఆత్మగౌరవం కోసం భవిష్యత్‌లోనూ పోరాడుతానని స్పష్టం చేశారు. గతేడాది తాను ఇలాంటి ఘటనపైనే దాఖలు చేసిన కేసును ఉపసంహరించబోనని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios