ఉపాధ్యాయుడి ట్రాన్స్‌ఫర్‌ను ఆపిన విద్యార్థుల కన్నీరు

First Published 22, Jun 2018, 3:17 PM IST
student Protests for Teacher Transfer
Highlights

ఉపాధ్యాయుడి ట్రాన్స్‌ఫర్‌ను ఆపిన విద్యార్థుల కన్నీరు

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ అయిన సందర్భాన్ని మనం పుస్తకాల్లో చదువుకున్నాం.. తమకు మంచి విద్యాబుద్దులు చెప్పిన ఆయన తమ వూరిని వదిలి వెళ్తుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాళ్ల వేళ్లాబట్టుకుని వెళ్లొద్దని బతిమలాడతారు. చివరకు గుర్రపుబగ్గీలో ఆయన్ను కూర్చోబెట్టుకుని రైల్వేస్టేషన్ వరకు తీసుకువెళతారు గుర్తుందా.. ? ఉపాధ్యాయులు తమతో ఏర్పరచుకున్న అనుబంధం వారిని అలా చేసింది.

ఇప్పుడు తమిళనాడులో సర్వేపల్లి గారి స్థాయిలో కాదులే కానీ.. అంతటి ఉద్విగ్న వాతావరణమైతే కనిపించింది. తిరువళ్లూరు జిల్లాలోని వలైగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న భగవాన్ అనే ఉపాధ్యాయుడిని రాష్ట్రప్రభుత్వం మరోప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేసింది.. దీంతో పాఠశాలలో వేరొకరికి తన బాధ్యతలు అప్పగించి ఊరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు భగవాన్.. అయితే ఈ విషయం విద్యార్థుల వరకు వెళ్లడంతో వారు ఆ వార్త తట్టుకోలేకపోయారు.. వెళ్లొద్దని బతిమలాడారు.. కొందరు ఉద్యోగులు ఆయనను పట్టుకుని గట్టిగా ఏడ్వసాగారు..

భగవాన్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా.. ఆయనను పాఠశాల నుంచి కదలనీయలేదు. దీనికి కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వంత పాడటంతో ఆయన అంగుళం కూడా కదల్లేకపోయారు.. ఈ విషయం జిల్లా విద్యాశాఖాధికారుల వరకు వెళ్లడంతో.. చలించిన వారు భగవాన్ ట్రాన్స్‌ఫర్‌ను పది రోజుల పాటు నిలిపివేశారు..

2014లో ఇక్కడికి టీచర్‌గా వచ్చిన భగవాన్ ఇంగ్లీష్ అంటే ఇక్కడి వారిలో ఉన్న భయాన్ని పొగొట్టారు. ఎప్పటికిప్పుడు అనుమానాలు తీరుస్తూ ప్రతిరోజు అందుబాటులో ఉండేవాడు.. సాయంత్రం స్పెషల్ క్లాసులు తీసుకోవడంతో పాటు.. జీకే, కాంపిటీటిక్ పరీక్షలు, సమాజాసేవ గురించి వివరిస్తూ.. ఒక అన్నలా, స్నేహితుడిలా, మార్గదర్శిలా నిలుస్తూ.. పిల్లలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. 

 
 

loader