మనకు విద్యను బోధించే టీచర్లు.. దైవంతో సమానమని పెద్దలు చెబుతుంటారు. తల్లి, తండ్రి తర్వాత ఆ స్థానం గురువుకే ఇస్తాం. అలాంటి స్థానంలో ఉన్న ఓ ఉపాధ్యాయురాలిపై విద్యార్థి కన్నేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తిరుచ్చి జిల్లా తురైయూర్ యూనియన్ కోంబై గ్రామ పంచాయతీ పరిధిలోని అడవి ప్రాంతంలో మరుదై కొండ గ్రామం ఉంది. ఇక్కడ ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ శాఖ తరపున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో 26 ఏళ్ల వయస్సున్న ఉపాధ్యాయురాలు పని చేస్తున్నారు. ఈ కొండ గ్రామానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో దట్టమైన అడవి ప్రాంతంలో రెండు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంది. ఈ స్థితిలో గత 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత ఉపాధ్యాయురాలు అడవి మార్గంలో ఇంటికి బయలుదేరారు.

మార్గం మధ్యలో కొండ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు అక్కడికి వచ్చారు.  టీచర్‌ను అడ్డుకుని ఆమెపై అత్యాచారం చేయడానికి తీవ్రంగా యత్నించాడు. దీంతో ఆమె బాలుడి చెర నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ తిరిగి గ్రామానికి చేరుకుంది. అనంతరం విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసింది. వారంతా ఆమెకు అండగా నిలిచారు. బాలుడిని అరెస్టు చేయాలంటూ  ఆందోళన చేపట్టారు. మహిళ ఉపాధ్యాయురాలికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.