న్యూఢిల్లీ: ఈశాన్య భారత్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు  అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలో భూ ప్రకంపనల తీవ్రతకు ప్రజలు భయంతో పరుగులు తీశారు. 

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు సమాచారం. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

అరుణాచల్‌ ప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న మయన్మార్‌, భూటాన్‌లో కూడా భూమి కంపించినట్లు  చైనా అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టమేమీ సంభవించలేదు.