గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల చేతిలో 20 మంది భారతీయులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వాస్తవాలేంటీ..? సోమవారం రాత్రి గాల్వాన్‌ లోయ వద్ద ఏం జరిగింది..? ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండానే మనదేశం వైపు 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీ సంఖ్యలో సైనికులు క్షతగాత్రులవ్వడం సాధారణ విషయం కాదు.

అయితే భారత సైన్యంపై దాడికి చైనా సైన్యం ఇనుప చువ్వలు బిగించిన ఐరన్ రాడ్లను ఉపయోగించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన మేకుల్లాంటి ఇనుప చువ్వలను వెల్డింగ్ చేసి ఉన్న ఫోటోలను ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్ శుక్లా ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read:కల్నల్ సంతోష్ వీరమరణం.. గాల్వన్ వ్యాలీ.. ఇంతకీ అసలేం జరిగింది?

గాల్వాన్ ఘర్షణ జరిగిన ప్రదేశంలో భారత సైన్యం ఈ ఫోటోలు తీసినట్లు ఆయన తెలిపారు. ఆర్మీలో కల్నల్‌గా సేవలందించిన అజయ్ శుక్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్నో విషయాలను గతంలో వెలుగులోకి తీసుకొచ్చారు.

ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. ఇది సైనిక చర్య కాదని కుట్ర, నేరపూరిత చర్యగా అభివర్ణించారు. ఇనుప చువ్వల తయారీని బట్టి చైనా పక్కా వ్యూహాంతోనే భారత సైన్యంపై దాడికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని అజయ్ అన్నారు.

కొందరు సైనికులు చెప్పిన విషయం ప్రకారం భారత జవాన్లను, చైనా సైనికులు తమ భూభాగంలోకి లాక్కెళ్లారని... ఇంకొందరు కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను విసరారని తెలిపారు.

Also Read:చైనా వాదన ఆమోదయోగ్యం కాదు: గాల్వన్ లోయపై తేల్చేసిన ఇండియా

ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు పదుల సంఖ్యలో సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్న సైనికులు ఇచ్చిన సమాచారంతోనే అదనపు బలగాలు చైనా సైన్యంతో తలపడ్డాయని తెలుస్తోంది.

కాగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబు మృతదేహానికి గురువారం ఆయన స్వస్థలం సూర్యాపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సైన్యం, పోలీసులు, స్ధానిక ప్రజలు వేలాదిగా పాల్గొని అమరవీరుడికి నివాళులర్పించారు.