ఎంతైనా సవతి తల్లి సవతి తల్లేరా కన్న తల్లి కాలేదు కదా..? ఇది మాట మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. కన్న తల్లి అయితే ఆ ప్రేమ వేరన్నది దాని అర్థం. అయితే కొందరు సవతి తల్లులు కన్నతల్లికి మించి ప్రేమను పంచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ  చెప్పబోయేది మొదటి రకం సవతి తల్లి గురించి.. తిరువనంతపురానికి చెందిన ఓ ఓ ఏడేళ్ల చిన్నారిపై సవతి తల్లి అమానుషంగా ప్రవర్తించింది.

నిద్రలో పక్క తడుపుతోందని మారు కూతురిపై మండిపడింది. అక్కడితో ఆగకుండా వేడి వేడి గరిటెతో వాతలు పెట్టింది. కాలిన గాయాలతో బాధపడుతూనే చిన్నారి పాఠశాలకు వెళ్లింది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే విద్యార్థిని దిగాలుగా కూర్చొని ఉండటంతో టీచర్లు ఏం జరిగిందని ప్రశ్నించారు.

పక్క తడుపుతున్నానని.. సవతి తల్లి తనకు వాతలు పెట్టిందని ఏడుస్తూ చెప్పింది. చిన్నారి పొట్ట, తొడలపై కాలిన గాయాలు చూసి చలించిపోయిన టీచర్లు... ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. వారు బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సవతి తల్లితో పాటు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.