జమిలి ఎన్నికలపై సంప్రదింపులు: నీతి ఆయోగ్ మీటింగ్ లో మోడీ

States Getting Over Rs 11 Lakh Crore From Centre, PM At NITI Aayog Meet
Highlights

నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ:  జమిలి ఎన్నికలపై చర్చ, సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలను కోరారు.జీఎస్టీ అమల్లో సహకరించినందుకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన ఆదివారం నాడు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్  నాలుగో సమావేశం ప్రారంభమైంది.ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.11 లక్షల కోట్లను రాష్ట్రాలు పొందనున్నాయని ఆయన చెప్పారు.

 ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. పోటీతత్వంతో కూడిన సమైక్య స్ఫూర్తితో అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో వనరులకు ఎలాంటి కొదవ లేదన్నారు. వాటిని సరైన రీతిలో వినియోగించుకోవాలని సూచించారు.

విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. జన్‌ధన్‌ యోజన, ముద్రబ్యాంకు రుణాల పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచాయని వివరించారు. గత సమావేశ నిర్ణయాల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు, ఆయుష్మాన్‌ భారత్, పోషణ్‌ మిషన్, మిషన్‌ ఇంద్రధనుష్, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు, తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదు.

 

దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే దఫా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో మోడీ మరోసారి ప్రస్తావించారు. ఎన్నికలు ఒకే దఫా పూర్తై ఆయా రాష్ట్రాల్లో అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని మోడీ భావిస్తున్నారు. ఈ మేరకు జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతున్నారు. 

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పంట దిగుబడి పెంపు విషయమై ఆలోచన చేయాలని ఆయన సూచించారు.వ్యవసాయాన్ని ఉపాధిహమీ అనుసంధానం చేయడంపై అధ్యయనం చేయాలని ప్రధానమంత్రి మోడీ కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, బెంగాల్, సిక్కిం, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సీఎంలను మోడీ కోరారు. 
 

నిర్మాణాత్మక చర్చల ద్వారా సీఎంల అభిప్రాయాలను  ప్రధానమంత్రి మోడీ కోరారు. రాష్ట్రాల అభిప్రాయాలను మూడు మాసాల్లో ఆచరణల్లోకి తీసుకురావాలని మోడీ నీతీ ఆయోగ్ ను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎల్‌ఈడీ దీపాలు వినియోగించాలని మోడీ సూచించారు. అధికారుల నివాసాల్లో కూడ ఎల్ఈడీ బల్బులను వాడాలని సూచించారు.వృద్ది రేటును రెండంకెలకు తీసుకెళ్ళాల్సిన  అవసరం ఉందని మోడీ కోరారు.


2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 7.7గా ఉందన్నారు. అయితే దీన్ని రెండంకెల స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని మోదీ తెలిపారు. 2022 నాటికి సరికొత్త భారతాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, వాటి నుంచి ప్రజలు లబ్ధిపొందుతున్న తీరును ప్రధాని వివరించారు. అంతేగాక.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరదలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆ రాష్ట్రాలకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

loader