SpiceJet Aircraft Fire: స్పైస్‌జెట్ విమానం అకస్మాతుగా మంటల్లో చిక్కుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం ఆగి ఉన్న స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగాయి.
SpiceJet Aircraft Fire: ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విమానాశ్రయంలో ఇంజన్ మెయింటెనెన్స్ పనుల్లో ఉన్న స్పైస్‌జెట్ విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మరియు మెయింటెనెన్స్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్ కంపెనీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని విమానయాన సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. Q 400 విమానం మెయింటెనెన్స్‌లో ఉన్నప్పుడు.. దాని ఇంజన్ (నంబర్ 1)లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. వెంటనే మెయింటెనెన్స్ సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను ఆర్పారు. ముందు జాగ్రత్తలు తీసుకుని అగ్నిమాపక సిబ్బందిని కూడా అక్కడికి రప్పించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఎయిర్‌క్రాఫ్ట్ ఏసీలో రిపేరు చేస్తుండగా మంటలు చెలరేగాయని ఎయిర్‌పోర్ట్ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంలో విమానాశ్రయంలో పోలీసులను పిలవలేదు, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
