భారీ ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది.
భారీ ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాలు గతం కంటే ముందే పలకరిస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాయని తెలిపింది. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులతో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నట్టుగా పేర్కొంది. ఇది వ్యవసాయంపై ఆధారపడిన భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నాలుగు నెలల కాలానుగుణ వర్షాల ప్రారంభానికి సంకేతాలు ఇచ్చింది.
ఇక, అండమాన్ నికోబార్ దీవులు, వాటి పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నైరుతి గాలులు బలపడటం వల్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ‘‘రానున్న 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి’’ అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక, సోమవారం నుంచి బుధవారం వరకు తమిళనాడులో, మరో రెండు రోజుల్లో లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, దక్షిణ కర్ణాటక తీరంలో 4-5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మరోవైపు పశ్చిమ వాయువ్య, మధ్య భారత్‌పై ఉష్ణగాలుల ప్రభావంగా క్రమంగా తగ్గుముఖం పట్టిందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణలో మోస్తరు నుంచి విస్తార వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. విదర్భ, కోస్తాంధ్ర జిల్లాల్లో కొనసాగుతున్న ఉష్ణ గాలుల తీవ్రత కొనసాగుతున్నట్టుగా తెలిపింది.
ఇక, సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి జూన్ 1వ తేదీన ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి ముందుగానే మే 27 న కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు కూడా ముందుగానే రుతుపవనాలు రానున్నాయి.
