ముంబయిలో జరగనున్న విపక్షాల మూడో సమావేశాలకు కాంగ్రెస్ సీనియర్ లీడర్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుకానున్నట్టు మహారాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ నానాపటోలె వెల్లడించారు. ఈ సమావేశంలో అజెండాపై చర్చలు జరుగుతాయని తెలిపారు. 

ముంబయి: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలు అన్నీ ఏకమై బరిలో నిలబడటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. విపక్షాలన్నీ ఐక్య కూటమిగా ఏర్పడేందుకు ముందడుగు వేశాయి. పట్నా, బెంగళూరు సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ వారంలో విపక్షాలు ముంబయిలో సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మహారాష్ట్ర యూనిట్ స్పష్టం చేసింది.

మహారాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ నానా పటోలే సోమవారం మీడియాతో మాట్లాడారు. విపక్షాల కూటమిలో రెండు డజన్లకు పైగా పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీల ప్రతినిధులు ముంబయి సబర్బన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో సమావేశం కాబోతున్నారు. ఆగస్టు 31వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీన ఈ భేటీ జరుగుతుంది. 

ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరవుతారని నానా పటోలే తెలిపారు. ఈ కూటమి కోసం అధికారిక లోగోను లాంచ్ చేస్తారని వివరించారు. ఈ సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికల కోసం వారి ఎజెండాను ఖరారు చేసుకుంటారని తెలిపారు. 

Also Read: పిల్లలను ప్రయోజకులను చేశాడు.. కానీ, కడసారి చూపునకూ రాలేదు.. పెద్దాయనకు అంత్యక్రియలు నిర్వహించిన పోలీసు

జూన్‌లో తొలిసారి పట్నాలో సమావేశమైన సంగతి తెలిసిందే. రెండో భేటీ జులైలో బెంగళూరులో జరిగింది. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరు కావడంతో ప్రతిపక్షాల్లో సానుకూల వాతావరణం ఏర్పడినట్టు తెలిసింది. ఈ సమావేశంలోనే ప్రతిపక్షాలు తమ కూటమికి పేరును ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్‌గా ఫైనల్ చేసుకున్నాయి. తాజాగా, ఈ నెలాఖరులో మూడో భేటీ ప్రారంభం కానుంది.