ఇంట్లో ఉన్న జవాన్‌ను కిడ్నాప్ చేసి ఆపై హత్య.. మణిపూర్‌లో దారుణం
మణిపూర్‌లో ఓ ఆర్మీ జవాన్‌ను కొందరు దుండగులు నిన్న కిడ్నాప్ చేశారు. ఈ రోజు ఉదయం ఆయన విగతజీవుడై కనిపించాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మరో దారుణం వెలుగు చూసింది. సెలవులో ఇంటి వద్ద ఉన్న ఆర్మీ జవాన్‌ను కొందరు దుండగులు తుపాకీ తల వద్ద పెట్టి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఈ ఘటన వెస్ట్ ఇంఫాల్ జిల్లాలో చోటుచేసుకుంది.శనివారం కిడ్నాప్ చేయగా.. ఈ రోజు ఉదయం ఆయన డెడ్ బాడీ లభించింది.
సెపోయ్ సెర్తో థాంగ్‌థాంగ్ కోమ్ సెలవులో ఇంటి వద్ద ఉన్నాడు. ఇంటి ముఖ ద్వారానికి పదేళ్ల కొడుకుతో కలిసి మరమ్మతులు చేస్తున్నాడు. అదే సమయంలో కొందరు దుండగులు తెలుపు రంగు వాహనంలో వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. తుపాకీ తీసి సెపోయ్ సెర్తో థాంగ్‌థాంగ్ కోమ్ తలకు గురి పెట్టారు. కారులోకి తీసుకెళ్లారు.
ఇందుకు ప్రత్యక్ష సాక్షి అయిన కొడుకు ఈ విషయాలను పోలీసులకు చెప్పాడు. ఆయన డెడ్ బాడీ ఇంఫాల్ ఈస్ట్‌లో మొంగ్జామ్‌లో ఈ రోజు ఉదయం లభించింది. ఆయన డెడ్ బాడీని తమ్ముడు, బావమరిది ధ్రువీకరించారు. ఆయన తలపై సింగిల్ బుల్లెట్ గాయం ఉన్నట్టు వారు చెప్పారు.
సెపోయ్ కోమ్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
Also Read: ఫోన్ దొంగిలించాడన్న అనుమానంతో మిత్రుడిని చంపేశాడు: పోలీసులు
ఈ ఘటనపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. సెపోయ్ సెర్తో థాంగ్‌థాంగ్ కోమ్ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వివరించింది. వారి కుటుంబం కోరుకున్నట్టుగా ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొంది. అన్ని విధాల ఆ కుటుంబానికి సహకరిస్తామని అధికారిక ప్రకటనలో ఆర్మీ తెలిపింది.