ఆర్థిక కష్టాలతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

మచిలీపట్నం : ఇద్దరు పిల్లలను చంపి ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న దారుణం ఐటీ సిటీ బెంగళూరులో చోటుచేసుకుంది. షేర్ మార్కెట్ లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడమే ఈ కుటుంబం ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం... కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన వీరాంజనేయ విజయ్(31) బెంగళూరులోని ఓ ఐటీ కంపనీలో టీం లీడర్ గా పనిచేసేవాడు. భార్య హైమావతి(29), ఇద్దరు పిల్లలతో కలిసి సిగేహళ్ళిలోని ఓ అపార్ట్ మెంట్ నివాసముండేవాడు. ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా జీవితం సాగుతుండగా విజయ్ కష్టాలను కొనితెచ్చుకున్నాడు. ఏమాత్రం అవగాహనలేని షేర్ మార్కెట్ లో భారీగా డబ్బులు పెట్టడం ప్రారంభించి నిలువునా మునిగిపోయాడు విజయ్. తాను దాచుకున్న డబ్బులతో పాటు అప్పులు చేసిమరీ షేర్ మార్కెట్ పెట్టాడు.

షేర్ మార్కెట్ లో పెట్టిన డబ్బులు పోవడం... అప్పుల బాధ ఎక్కువకావడంతో విజయ్ కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీంతో కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట ఏడాదిన్నర పెద్దకూతురు మోక్షతో పాటు ఆరు నెలల చిన్నకూతురు సృష్టిని తమ చేతులతోనే గొంతునులిమి చంపేసారు దంపతులు. ఆ తర్వాత విజయ్, హైమావతి దంపతులు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

Read More ఆమె తెలివికి పోలీసులే షాక్: మద్యం తాగించి, మటన్ పెట్టి, వీడియో తీసి..

విజయ్ కుటుంబం ఆత్మహత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి ల్యాప్ టాప్ ను పరిశీలించగా షేర్ మార్కెట్ వ్యవహారం బయటపడింది. ఆర్థిక కష్టాలే ఈ కుటుంబం ఆత్మహత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా శనివారం మచిలీపట్నంలో అంత్యక్రియలు నిర్వహించారు.