రాజ్యాంగ కొత్త ప్రతులలో కనిపించని సోషలిస్ట్, సెక్యులర్ పదాలు.. - ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి ఆందోళన
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగం కొత్త కాపీల్లో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు లేవని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు. ఇది ఆందోళన కలిగించే విషయం అని చెప్పారు.
పార్లమెంట్ కొత్త భవనంలోకి ప్రవేశించే ముందు ఎంపీలకు అందజేసిన రాజ్యాంగ కొత్త ప్రతులలో పీఠికలో భాగమైన 'సోషలిస్ట్', 'సెక్యులర్' అనే పదాలు కనిపించలేదని కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి బుధవారం ఆరోపించారు. దీనిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తాలనుకున్నానని, కానీ తనకు ఆ అవకాశం రాలేదని చెప్పారు.
‘‘ఈ రోజు (సెప్టెంబర్ 19) మాకు ఇచ్చిన రాజ్యాంగం కొత్త కాపీలు, మేము మా చేతుల్లో పట్టుకుని (కొత్త పార్లమెంటు భవనం) ప్రవేశించాము. దాని పీఠికలో 'సోషలిస్ట్ సెక్యులర్' అనే పదాలు లేవు. 1976లో సవరణ తర్వాత ఈ పదాలను చేర్చారని మాకు తెలుసు. కానీ ఈ రోజు ఎవరైనా మాకు రాజ్యాంగాన్ని ఇస్తే, అందులో ఆ పదాలు లేకపోతే, అది ఆందోళన కలిగించే విషయం’’ అని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు.
అయితే ప్రభుత్వ ఉద్దేశంపై చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ‘‘వారి ఉద్దేశం అనుమానాస్పదంగా ఉంది. తెలివిగా చేశారు. ఇది నాకు ఆందోళన కలిగిస్తోంది. నేను ఈ సమస్యను లేవనెత్తడానికి ప్రయత్నించాను. కానీ ఈ సమస్యను లేవనెత్తడానికి నాకు అవకాశం లభించలేదు.’’ అని అన్నారు. కాగా.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ కూడా పీఠికలో అది (సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు) లేవని అన్నారు.
1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా 'సోషలిస్టు', 'సెక్యులర్' అనే పదాలను పీఠికలో చేర్చారు. మైనారిటీలకు భద్రత కల్పించడం, పెట్టుబడిదారీ వర్గం ప్రభుత్వాన్ని, పేద వర్గాలను శాసించకూడదనేది దీని ఉద్దేశం.
ఇదిలా ఉండగా.. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం భారత రాజ్యాంగ ప్రతి, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపును ఎంపీలకు అందజేశారు. ఒక గిఫ్ట్ బ్యాగ్ లో ఎంపీలకు ఈ బహుమతులు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొత్త భవనంలో జరిగాయి.