స్కూటీలో ఇరుక్కుపోయిన పెద్ద పాము.. సురక్షితంగా బయటకు తీసిన మహిళ.. వైరల్ వీడియో ఇదే

శ్రీనగర్‌లో ఓ పెద్ద పాము స్కూటీలో ఇరుక్కుంది. బయటకు రాలేదు. దీంతో స్నేక్ క్యాచర్ అలియా మిర్‌కు కాల్ చేశారు. ఆమె పరుగున వచ్చి పామును సురక్షితంగా స్కూటీ నుంచి బటయకు తీసి అడవిలో వదిలి పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
 

snake stuck in scooty wildlife expert aliya mir rescued in a viral video

న్యూఢిల్లీ: పాము అంటే కిలోమీటర్ దూరం పరుగెత్తేవారే ఎక్కువ. అది విషపూరిత పామా? కాదా? అనేది తర్వాత విషయం. పాము ఉన్నదంటే.. అక్కడి నుంచి పరుగు పెట్టేవారే ఎక్కువ. లేదా.. కొంత ధైర్యం కూడబెట్టుకుని కొందరు వాటిని కర్రలతో కొట్టి చంపేస్తారు. కానీ, వాటిని సురక్షితంగా పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టేవారు చాలా అరుదు. అందుకే స్నేక్ క్యాచర్లు అంటే అంత పేరు. అంత గౌరవం. మన తెలుగు రాష్ట్రాల్లో స్నేక్ క్యాచర్లు ఎక్కువ మందే ఉన్నారు. కానీ, జమ్ము కశ్మీర్‌లో మాత్రం స్నేక్ క్యాచర్లు చాలా తక్కువ. శ్రీనగర్‌లోనైతే.. వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్ మాత్రం ఒకరే ఉన్నారు. ఆ ఎక్స్‌పర్ట్ కూడా మహిళ కావడం గమనార్హం. ఆమె పేరు అలియా మిర్. ఆమె ఎక్కడ స్నేక్ క్యాచ్ చేసినా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది. తాజాగా, ఆమెదే ఓ వీడియో వైరల్ అవుతున్నది.

శ్రీనగర్‌లో ఓ పాము తన గూటి నుంచి బయటకు వచ్చి ఎదురుగా కనిపించిన ఓ స్కూటీలోకి వెళ్లింది. ఆ స్కూటీ ఇంజిన్ భాగంలోకి దూరింది. అప్పుడే ఆ స్కూటీ యజమాని తన పని ముగించుకుని ఆ ద్విచక్ర వాహనం దగ్గరకు వచ్చాడు. స్కూటీ స్టార్ట్ చేశాడు. కానీ, ఏదో తేడాగా అనిపించింది. ముందు చక్రం వైపు చూడగా.. ఓ తోక వంటిది కనిపించింది. అది పాము తోక లాగే కనిపించడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే స్కూటీని స్టాండ్ వేసి పక్కకు ఉరికాడు. మళ్లీ దగ్గరకు వచ్చి అది ఏమిటా? అని పరిశీలించాడు. ఇంకేమిటీ.. గుండెలు ఆపేంత దృశ్యం కనిపించింది. తన అనుమానమే నిజమైంది. అది పాము అని నిర్ధారించుకున్నాడు. కానీ, ఆ పాము బయటకు రాలేకపోతున్నది. ఆ స్కూటీలోనే ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు వెంటనే వన్ అండ్ ఓన్లీ అలియా మిర్‌కు కాల్ చేశారు. ఆమె పరుగున స్పాట్‌కు వచ్చింది.

హడావిడిగా తన వాహనం దిగుతూ.. పాము వెళ్లిపోయిందా? అనే సందేహంతో అడిగింది. ఆ స్కూటీలో ఇరుక్కున్నదని చెప్పగానే అక్కడికి వెళ్లింది. సులువుగా ఆ పామును తీసేయొచ్చు అని ఆమె భావించింది. కానీ, ఆ పాము లోపల ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోతున్నది. బలవంతంగా లాగేస్తే పాముకు హాని జరగవచ్చు. కాబట్టి, కొంత సమయం తీసుకునైనా సరే దాన్ని సురక్షితంగా బయటకు తీయాలని ఆమె కచ్చితంగా చెప్పేసింది. అందుకు స్థానికులు కూడా సహకరించారు. మెల్లగా స్థానికుల సహకారంతో ఆ పామును స్కూటీలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఆ పామును ఓ బాక్సులో జాగ్రత్తగా ఉంచి అడవిలో వదిలిపెట్టారు.

ఆమె పామును కాపాడుతున్నప్పుడు కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు. మే 18వ తేదీన ఆమె పోస్టు చేశారు. ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios