డబ్బులు రాలేవని ట్రైన్ బోగీలోనే పాములు వదిలిన పాములాడించేవారు.. బోగీలో గందరగోళం
ఉత్తరప్రదేశ్‌లో కొందరు పాములు ఆడించేవారు ట్రైన్ ఎక్కారు. ట్రైన్ కదలగానే బుట్టలను తెరిచి పాములను ఆడించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి డబ్బులు అడిగారు. వారు అనుకున్నన్ని డబ్బులు రాకపోవడంతో పాములను బోగీలోకి వదిలారు. దీంతో 30 నిమిషాలపాటు ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

న్యూఢిల్లీ: సాధారణ ప్రయాణికులు ఎక్కినట్టే నలుగురు పాములాడించేవారు కూడా పాము బుట్టలు చేతపట్టుకుని ట్రైన్ బోగీలోకి ఎక్కారు. ట్రైన్ కదిలిన తర్వాత బుట్ట పై కప్పు తీసేశారు. అందులోని పాములు తలలు బయటకు పెట్టాయి. వారు పాములు ఆడించడం మొదలు పెట్టారు. కొద్దిసేపు ఈ ఆట సాగిన తర్వాత వారు ప్రయాణికుల నుంచి డబ్బుల కోసం అడిగారు. కొందరు ఇచ్చారు. మరికొందరు నిరాకరించారు. వారు అనుకున్నంత డబ్బులు రాలేవని పాములు ఆడించేవారు ఆగ్రహానికి లోనయ్యారు. కొందరు ప్రయాణికులతో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆగ్రహంతోనే పాములను విడిచిపెట్టారు. ఆ పాములు బుట్టలో నుంచి బయటికి వచ్చి బోగీలో పాకడం మొదలు పెట్టాయి. దీంతో ప్రయాణికులు గుండె చేతిలోకి వచ్చినంత పనైంది. అందరూ మూలలకు పరుగులు పెట్టారు. పైన బెర్త్‌ల కోసం ఎగబడ్డారు. కొందరు టాయిలెట్ రూమ్‌లలోకి పరుగు తీశారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చంబల్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హౌరా, గ్వాలియర్‌ల నడుమ ప్రయాణించే ట్రైన్‌లో ఈ ఘటన జరిగింది. బందా స్టేషన్‌లో ఈ పాములాటలవాళ్లు ట్రైన్ ఎక్కారు. 60 నిమిషాల తర్వాత వచ్చిన మహోబా రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. అయితే.. వారు ట్రైన్ ఎక్కినాక బోగీలో పాములను వదిలిపెట్టిన 30 నిమిషాలపాటు గందరగోళం నెలకొంది. ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ నిమిషాలు లెక్కపెట్టుకున్నారు. ఆ సమయం పీడకలలా సాగింది. కొందరైతే రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి విజ్ఞప్తులు చేశారు. ఆ ట్రైన్ మహోబాకు రాగానే ఆ ప్రయాణికులు పోలీసుల వద్దకు వెళ్లారు. వారు బోగీలోకి ఎక్కారు. కానీ, అప్పటికే ఆ పాములాడించే వారు జారుకున్నారు.
Also Read: మరోసారి వర్చువల్‌గా భేటీ అవుదాం.. బ్రెజిల్ బాధ్యతలు తీసుకోవడానికి ముందే.. ప్రధాని మోడీ ప్రతిపాదన
ఆ తర్వాత కూడా పోలీసు సిబ్బంది జాగ్రత్తగా ట్రైన్ బోగీ మొత్తం వెతికారు. కానీ, పాముల ఆనవాళ్లేవీ కనిపించలేవు. వారే ఆ పాములను కూడా వెంటబెట్టుకుని దిగిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత ట్రైన్ గ్వాలియర్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిన ఆ పాములు ఆడించేవారిని పట్టుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు.