నెలసరి జబ్బు కాదు.. స్మృతి ఇరానీ
నెలసరి వైకల్యం కాదు. దీనికోసం వేతనంతో కూడిన సెలవు అవసరం లేదంటూ స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ : భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమంత్రి, ఎక్కువగా ట్రోలింగ్ కు గురయ్యే మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆమె స్మృతి ఇరానీనే. గతంలో ఈ కారణంతోనే ఓ సారి తన ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోనే కోల్పోయారు. తాజాగా మహిళల మీద మరో వివాదాస్పద వ్యాఖ్యతో ట్రెండింగ్ లో ఉన్నారామె.
స్మృతి ఇరానీ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్నారు. మహిళలకు పీరియడ్ సమయంలో సెలవుల విషయంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేక ప్రైవేట్ సంస్థలు తమ ఆఫీసుల్లో పనిచేసేవారికి వేతనంతో కూడిన నెలసరి సెలవును ఇస్తున్నాయి. ఫస్ట్ డే ఆన్ పీరియడ్, పీరియడ్ లీవ్ కింద ఈ సెలవును నెలసరి సమయంలో ఒక రోజు వాడుకునేలా వెసులుబాటు కల్పించాయి.
దీనిమీద మహిళా ఉద్యోగులకు పీరియడ్ సెలవులు ఇచ్చే ప్రతిపాదనను రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ నెలసరి వైకల్యం కాదు. అదొక సహజ ప్రక్రియ అంటూ స్పందించారు. ఈ సెలవు మహిళలకు అవసరం లేదు అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగుతోంది.
శబరిమల అయ్యప్ప సన్నిధిలో భక్తులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు ?
స్మృతి ఇరానీ తాను అన్న మాటలకు వివరణ కూడా ఇచ్చారు. ఇలా మహిళలకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం వల్ల పని ప్రదేశాల్లో వివక్షకు దారి తీస్తుందన్నారు. ఈ తలనొప్పులన్నా ఎందుకని కొన్ని సంస్థలు మహిళలను తీసుకోవడానికి ఆసక్తి చూపించరని, అలా మహిళలకు ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు.
ఇప్పుడే కాదు గతంలో ఈ సెలవు గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ ప్రశ్న వేయగా దానికి కూడా ఆమె ఈ రకంగానే సమాధానం చెప్పారు. అన్ని సంస్థల్లో వేతనంతో కూడిన నెలసరి సెలవును తప్పనిసరి ప్రకటించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. పీరియడ్ సమయంలో బాధ కొద్దిమంది మహిళలకు మాత్రమే ఉటుందని, మందులు వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు.
నూటికి 90మంది మహిళలకు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, నడుంనొప్పి.. కండరాల నొప్పులు లాంటి డిస్మెనోరియా ఉంటుంది. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల దీనినుంచి కొంత ఉపశమనం ఉంటుంది. ఈ పీరియడ్ లీవ్ ను ప్రవేశపెట్టిన తరువాత చాలామంది మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. తాము పనిచేసే ప్రాంతాల్లో కూడా ఇలాంటి సౌకర్యం కలిగిస్తే బాగుండనుకున్నారు.
స్మృతి ఇరాని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో కూడా ఉచితపథకాలతో మొదలు ఆకలి వరకు అనేక అంశాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ యేడు నవంబర్ లో రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ కాంగ్రెస్ నేతను నంపుసకుడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లోని టోంక్ కు వచ్చిన ఆమె అక్కడ భిల్వారాలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. ఓ యువతిపై అత్యాచారం చేసి.. నగ్నంగా చేసి, ముక్కలుగా నరికి పొయ్యిలో పడేశారని.. దీనిమీద కాంగ్రెస్ నేత పురుషుల రాజ్యం అని కామెంట్ చేశారని.. అలా మాట్లాడే నంపుసకుడు ఎవరుంటారు అంటూ ధ్వజమెత్తారు.
ఈ యేడు అక్టోబర్ లో స్మృతి ఇరానీ ఆకలిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హంగర్ ఇండెక్స్ నివేదికను ఆమె తప్పు పట్టారు. ఆకలి సూచీలో భారత్ 11వ స్థానంలో ఉంది. ఈ విషయంలో పాకిస్థాన్ కంటే వెనకబడి ఉంది. దీని మీద మాట్లాడుతూ ఆమె భారత్ ను ఇలాంటి సూచికలతో అంచనా వేయలేమన్నారు. అదంతా ఉద్దేశపూర్వకంగా చేసిందన్నారు. భారత్ లో 140 కోట్లమంది ఉంటే ప్రజలు ఉంటే మూడువేలమందిని పిలిచి, ఆకలేస్తుందా? అని అడుగుతారు. అలా సూచీని రూపొందించారన్నారు.