ఢిల్లీలో గతవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

ఢిల్లీ : గతవారం ఢిల్లీలో ఓ ఘోర ఘటన జరిగింది. దక్షిణ ఢిల్లీలోని ఫ్లైఓవర్ కింద నిద్రిస్తున్న వారిపై ఓ వాగన్ ఆర్ పల్టీలు కొట్టడంతో.. ఇద్దరు మైనర్లు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు కారణం బిఎమ్‌డబ్ల్యూ కారు అని తెలుస్తుంది. ఓ 27యేళ్ల వ్యాపారవేత్త తన అంకుల్ కొన్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ కారును ట్రయల్ రైడ్ కు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి వాగన్ఆర్‌ను ఢీకొట్టింది. దీంతో వాగన్ఆర్ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ కింద నిద్రిస్తున్న వారిపై పడి దూసుకువెళ్లింది.

జూన్ 10న లోధి రోడ్ ఫ్లై ఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో వ్యాగన్‌ఆర్‌లో ఉన్నవారు కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిందితుడు పారిపోయాడని, ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అరెస్టు చేశామన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. డిసిపి (ఆగ్నేయ) ఈషా పాండే మాట్లాడుతూ, “బ్లాక్ బిఎమ్‌డబ్ల్యూ వ్యాగన్ఆర్‌ను ఢీకొట్టిందని, దీంతో ఆ కారు పల్టీలు కొట్టి ఫ్లైఓవర్ కింద నిద్రిస్తున్న వారిపై పడిందని కనిపెట్టామన్నారు. వారిని వెంటనే AIIMS ట్రామా సెంటర్‌కు తరలించారు, అక్కడ ఇద్దరు పిల్లలు రోష్ని (6), ఆమె సోదరుడు అమీర్ (10) మృతి చెందినట్లు ప్రకటించారు. మిగిలిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.”

వ్యాగన్ఆర్ డ్రైవర్ యతిన్ శర్మ (18) ఆ సమయంలో తన ముగ్గురు స్నేహితులతో ఉన్నాడని పోలీసులకు చెప్పాడు. “నేను స్టూడెంట్ ని, PR ప్రమోటర్‌గా కూడా పని చేస్తున్నాను. ఆ రోజు, నేను నా స్నేహితులతో కలిసి సామ్రాట్ హోటల్ నుండి సూర్య హోటల్‌కి వెడుతున్నాను. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో, మేము ఫ్లైఓవర్ దాటుతుండగా, మా కారుకు కుడి వైపున వెడుతున్న ఓ నల్లటి కారు ఢీకొట్టింది. దీంతో అది పల్టీలు కొట్టి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై పడింది. ఈ ఘటనలో నా స్నేహితులు, నేను కూడా గాయాలపాలయ్యాం. మాకు అక్కడి వారు సహాయం చేసారు. కారు డ్రైవర్ మూల్‌చంద్ వైపు నుండి వెళ్లిపోయాడు, ”అని శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నాడని.. ఆ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Oil Tanker: బ్రిడ్జిపై నుంచి నదిలో ప‌డ్డ‌ ఆయిల్‌ ట్యాంకర్‌.. భారీ పేలుడుతో నలుగురు మృతి

గాయపడిన వ్యక్తులు తప్ప ఈ కారును గుర్తించడానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, గాయపడిన వారికి కూడా నల్ల కారు గురించి ఏమీ గుర్తు లేదని పోలీసులు తెలిపారు. “ఫ్లైఓవర్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాలు పనిచేయడంలేదు. ఒబెరాయ్ హోటల్, లోధి రోడ్, బారాపుల్లా సమీపంలోని కెమెరాలను పరిశీలించాం. CCTV మ్యాపింగ్‌ని ఉపయోగించి, 120కి పైగా కెమెరాలను విశ్లేషించి... కారు BMWగా గుర్తించాం. దాని యజమానిని పట్టుకుని ప్రశ్నించగా, కారు తన మేనల్లుడు సాహిల్ నారంగ్ (27) వద్ద ఉందని, అతను నోయిడాలోని వర్క్‌షాప్‌లో సర్వీసింగ్ కోసం ఇచ్చాడని చెప్పాడు. అతను అందించిన వివరాల మేరకు నిర్మాణ్ విహార్‌లోని నివాసం నుంచి సాహిల్‌ను అరెస్టు చేశారు. సర్వీస్ కేంద్రం నుంచి బీఎండబ్ల్యూను స్వాధీనం చేసుకున్నారు’’ అని డీసీపీ పాండే తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సాహిల్ నారంగ్, అతని మామ విమానాశ్రయం నుండి వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు కొత్తగా కొన్నారు. దీంతో సాహిల్ దాని వేగం, పనితీరు టెస్ట్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే వాగన్ఆర్ అను ఢీ కొట్టాడు.. అని డిసిపి తెలిపారు. ఈ మేరకు సాహిల్‌పై ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా కారు తోలడంతో పలువురి మరణానికి కారణం అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాహిల్ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నోయిడాలో గార్మెంట్ వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.